అక్కడ ఆవులతో పొదుపు
లా టూర్ డు పిన్ (ఫ్రాన్స్) : వడ్డీ రేట్లు రికార్డు స్థాయిలో తక్కువగా ఉండడంతోను, బ్యాంకులు ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా తేరుకోకపోవడంతోను ఫ్రాన్స్ లో పొదుపరులు కొందరు ప్రాథమిక దశకు పోయి ఆవులపై డబ్బును మదుపు పెట్టసాగారు. ఫ్రాన్స్ లో అత్యధిక జనాదరణ ఉన్న సేవింగ్స్ అకౌంట్ 'లివ్రెట్ ఎ' ద్వారా ఒక శాతం కన్నా కొద్దిగా ఎక్కువగా మాత్రమే వడ్డీ లభిస్తుండగా ఆవు యజమానులు ఆవుకు 1200 యూరోల (1700 డాలర్ల) ప్రాథమిక పెట్టుబడితో సాలీనా నాలుగు నుంచి ఐదు శాతం వరకు లాభాలు ఆశించవచ్చునని ప్రమోటర్లు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ వలె కాకుండా ఈ విధంగా ఆవులపై మదుపు పెట్టడం తక్కువ రిస్క్ తో కూడుకున్నది. లాభాలు ఆవు దూడల విక్రయంపై ఆధారపడి ఉంటాయి.
ఆగ్నేయ ఫ్రాన్స్ లో వెయ్యి మంది మదుపరుల తరఫున సుమారు 30 వేల పశువుల పోషణ చూస్తున్న సంస్థ 'జెస్టెల్' డైరెక్టర్ పియరీ మార్గ్వెరిట్ ఈ విషయం గురించి మాట్లాడుతూ, గత సంవత్సర కాలంగా అమ్మకాలు రెట్టింపు అయ్యాయని తెలిపారు. 'ఎవరైనా ఒక ఆవును లేదా ఎక్కువ ఆవులను కొనుగోలు చేసి వృత్తి రైతులకు బాడుగకు ఇవ్వవచ్చు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఈ పశువుల సంఖ్య పెరుగుతుంది. 20 ఆవుల సమూహంతో ఏటా అదనంగా ఒక ఆవు సమకూరుతుంది. అంటే సుమారు నాలుగు శాతం నుంచి ఐదు శాతం లాభం వస్తుందన్నమాట' అని మార్గ్వెరిట్ చెప్పారు.
మదుపరులు కావాలనుకుంటే కొత్త ఆవులను విక్రయించి డబ్బు తీసుకోవచ్చు లేదా దూడలను అక్కడే పెంచడం ద్వారా తమ పశుసంపద అలా పెరిగేందుకు వీలు కల్పించవచ్చు. అతదుపరి రిటైర్ మెంట్ దరిమిలా రాబడి పొందుతుండవచ్చు.
జాన్ క్లాడ్ జేన్స్ అనే రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఒకరు ఈ విషయం ప్రస్తావిస్తూ 'స్టాక్ మార్కెట్ లో గాని, బ్యాంకులో గాని పెట్టుబడి పెట్టడం కన్నా ఇది మెరుగైనది' అని పేర్కొన్నారు. ఆయన తన 60పైచిలుకు ఆవుల మంద నుంచి సాలీనా 5000 నుంచి 6000 యూరోల వరకు ఆదాయం పొందుతున్నారు.
News Posted: 2 September, 2009
|