పెట్రో ప్రాజెక్టు ఇక రానట్టే
విశాఖపట్నం : ఆర్థిక మాద్యం, ప్రపంచ విపణిలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు గణనీయంగా పడిపోవడం విశాఖపట్నం పారిశ్రామిక అభివృద్ధికి విఘాతంగా మారింది. లేకపోతే వేల కోట్ల రూపాయల పెట్టుబడుతో అంతర్జాతీయ స్థాయి పెట్రోలియం రిఫైనరీ - పెట్రో కెమికల్ ప్రాజెక్టు వచ్చి ఉండేది. భారతదేశంలో జన్మించిన కోటీశ్వరుడు లక్ష్మీ మిట్టల్, ఫ్రెంచ్ ఆయిల్ దిగ్గజం టోటల్ ఎస్ఏ కంపెనీలు ఈ ప్రాజెక్టులో దాదాపు నాలుగు వేల ఎనిమిదివందల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. కానీ, పరిస్థితులు అనూహ్యంగా మారిపోవడంతో మిట్టల్, టోటల్ ఎస్ఏ కూడా ఇప్పుడు వెనుకంజ వేశాయి. మరి విశాఖకు ఈ ప్రాజెక్టు సమీప భవిష్యత్తులో రానట్టేనని చెబుతున్నారు.
కేవలం ఎగుమతుల కోసమే ఈ అత్యాధునిక రిఫైనరీని స్థాపించాలని అనుకున్నారు. ఏటా పద్నాలుగు మిలియన్ టన్నుల ఉత్పత్తులను ఆగ్నేయ ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతి చేయాలన్నది లక్ష్యం. రాబోయే పదేళ్ళలో ఆసియా దేశాలకు రోజుకు అయిదు మిలియన్ బేరళ్ళ ఎగుమతి పెరుగుతుందని అంచనా వేశారు. కానీ ఆర్ధిక మాంద్యం పుణ్యమా అని అది గణనీయంగా పడిపోయింది. మిట్టల్, టోటల్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగినట్టేనని మొత్తానికి ప్రాజెక్ట్ ను ఆపివేశామని హెచ్ పీసీఎల్ అధికారి వెల్లడించారు. ఒకవేళ అన్నీ సజావుగా సాగితే హెచ్ పీసీఎల్, గెయిల్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, మిట్టల్, టోటల్ సంయుక్త భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్ట్ రూపకల్పన ఈ పాటికే పూర్తయి ఉండేదని వివరించారు. ఈప్రాజెక్టులో మిట్టల్ 49 శాతం అంటే 18,919 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టడానికి ముందుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. దీనికోసం విశాఖపట్నం హెచ్ పీసీఎల్ సమీపంలో 2500 ఎకరాల భూమిని సేకరించామని తెలిపారు.
News Posted: 17 September, 2009
|