ఉద్వాసనకూ అవే సంస్థలు!
చెన్నై : ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రిక్రూట్ మెంట్లు తగ్గిపోవడంతో నైపుణ్యం మదింపు సంస్థలు ఇప్పుడు కొత్త పాత్రను పోషిస్తున్నాయి. ఇప్పటికే తమ వద్ద ఉన్న ఉద్యోగులలో ఎవరి సామర్థ్యం ఎంతో తేల్చి అతనికి మరింత శిక్షణ ఇవ్వాలా లేక ఉద్వాసన పలకాలా లేక అతను సమర్థుడైతే పదోన్నతి కల్పించాలా అనేది నిర్ణయించడానికి సంస్థలు ఆ సంస్థల సేవలను ఉపయోగించుకుంటున్నాయి.
రిక్రూట్ మెంట్ అవసరాల కోసం ఈ సంస్థల సేవలను ఉపయోగించుకోవడం ప్రస్తుతం వెనుకపట్టు పట్టినప్పటికీ అంతర్గత మదింపు పరీక్షలు నిర్వహించేందుకు వీటికి డిమాండ్ పెరిగిందని మెరిట్రాక్ సర్వీసెస్ సంస్థ సిఇఒ మదన్ పడాకి తెలియజేశారు. 'ఇప్పుడు బంతి ఉపాధి సంస్థల కోర్టులో ఉంది. మార్కెట్ లో ప్రతిభావంతులు అధికంగా లభ్యమవుతున్నందున ఆ సంస్థలకు ఎంపిక చేసుకోవడానికి మరిన్ని అవకాశాలు ఉంటున్నాయి' అని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా చాలా సంస్థలలో శ్రామిక శక్తి తగ్గిపోయినప్పటికీ ఇప్పుడున్న సిబ్బందిపై మదింపు వేసేందుకు సంస్థల అధిపతుల నుంచి నైపుణ్యం మదింపు వేసే సంస్థలకు డిమాండ్ 20 శాతం నుంచి 25 శాతం వరకు పెరిగిందని 'అసెస్ పీపుల్' సంస్థ సిఇఒ ఆర్ కణ్ణన్ తెలియజేశారు.
'మెరిట్రాక్ గడచిన రెండు సంవత్సరాలుగా నెలకు 90 వేల నుంచి లక్షా పాతిక వేల వరకు ఈ విధమైన మదింపులు వేస్తున్నది. గడచిన ఆరు నెలలలో ఐటి/ఐటిఇఎస్, బిఎఫ్ఎస్ఐ, రీటైల్ సంస్థల నుంచి సంస్థకు ఎక్కువగా అభ్యర్థనలు వస్తున్నాయి. ఒక ఏడాది క్రితం వరకు ఒక త్రైమాసిక కాలంలో సుమారు 10 అభ్యర్థనలు వచ్చేవి. కాని గడచిన రెండు త్రైమాసిక కాలాలలో అంతర్గత మదింపుల కోసం 50 అభ్యర్థనలు వచ్చాయి' అని పడాకి తెలియజేశారు. 'మదింపు పరీక్షల కోసం రూపొందిస్తున్న ప్రశ్నావళి తీరును బట్టి వాటిలో కనీసం 25 శాతాన్ని అసమర్థుల నిర్థారణకు ఉపయోగిస్తున్నారని విదితమవుతోంది. దీనిని సిబ్బంది సంఖ్యను తగ్గించేందుకు ఉపయోగించుకోవచ్చు. ఈ ధోరణి క్రితం సంవత్సరం అక్టోబర్ తరువాత మాత్రమే కనిపించసాగింది' అని పడాకి వివరించారు.
ఇటువంటి సంస్థలకు వస్తున్న డిమాండ్ లో దాదాపు 60 శాతం ఐటి, ఐటిఇఎస్ కంపెనీలకు చెందినదే. సంస్థలు మూడు రంగాలపై దృష్టి నిలుపుతున్నాయి. ఆ మూడు రంగాలు శిక్షణ ఉపయోగపడుతున్న స్థాయి. అట్టిపెట్టుకోవలసిన ఉద్యోగిని నిర్థారించేందుకు, పదోన్నతికి విధానం రూపకల్పన, వారి కెరీర్ మార్గం మ్యాపింగ్.
News Posted: 29 September, 2009
|