పాక్ లో భారత టొమాటోలు
అట్టారి (అమృతసర్) : భారతదేశం నుంచి, ముఖ్యంగా నాసిక్ నుంచి టొమాటోలు పాకిస్తానీ వంటగదులను ముంచెత్తుతున్నాయి. దీనితో పంజాబ్ లో అట్టారి మీదుగా రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ లో ఈ సంవత్సరం టొమాటో పంట దెబ్బ తిన్నది. అందుకు భిన్నంగా నాసిక్ లో ఇబ్బడి ముబ్బడిగా టొమాటోల ఉత్పత్తి జరిగింది. మరి ఇండియా నుంచి పాకిస్తాన్ కు రోజు ట్రక్కుల నిండా సుమారు లక్షన్నర కిలోల (150 టన్నుల) టొమాటోల రవాణా జరుగుతుండడంలో ఆశ్చర్యమేమీ లేదు.
ఇండియా నుంచి దిగుమతి చేసుకునే బంగాళాదుంపలు, ఉల్లిపాయల మీద 25 శాతం సుంకాన్ని పాకిస్తాన్ ఆరు నెలల క్రితం విధించిన తరువాత సరిహద్దుల మీదుగా వర్తకం బాగా తగ్గిపోయింది. అట్టారి మీదుగా ఎగుమతి అయ్యే సరకులలో ఈ రెండు ప్రధానమైనవి కావడంతో రోజూ సరిహద్దులు దాటే ట్రక్కుల సంఖ్య 120 నుంచి సుమారు డజనుకు పడిపోయింది. కాని ఇప్పుడు కొత్తగా టొమాటోలకు గిరాకీ పెరగడంతో రోజూ సుమారు 130 ట్రక్కులు పూర్తి లోడ్ తో ఇండియా నుంచి పాకిస్తాన్ కు వెళ్ళనారంభించాయి. పాకిస్తాన్ నుంచి ఇండియాకు దిగుమతులు కూడా పెరిగాయి. వీటిలో డ్రై ఫ్రూట్ లు ముఖ్యమైనవి.
'అట్టారి సరిహద్దులో భారీ ట్రక్కుల రవాణా పునరుద్ధరణ జరగడం గొప్ప సంకేతం' అని భారత-పాకిస్తాన్ ఎగుమతిదారుల సంఘం చైర్మన్ ఓమ్ ప్రకాశ్ వ్యాఖ్యానించారు. 'అయితే, రెండు దేశాల ప్రభుత్వాలు స్వేచ్ఛా వాణిజ్యాన్ని అనుమతించినట్లయితే, గృహోపయోగ వస్తువులపై ఎటువంటి సుంకాన్నీ విధించనట్లయితే ఇంకా బాగుంటుంది' అని ఆయన అభిప్రాయం వెలిబుచ్చారు.
News Posted: 30 September, 2009
|