భారతి, ఎంటీఎన్ విలీనం రద్దు
న్యూఢిల్లీ: ఎంతో సంచలనం సృష్టించిన భారతి ఎయిర్ టెల్- ఎంటీఎన్ ప్రతిపాదిత విలీన ఒప్పందం ఖరారుగాక ముందే రద్దయిపోయింది. 23 బిలియన్ డాలర్లతో ముడిపడిన ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే, టెలికాం రంగంలో అతిపెద్ద ఒప్పందమై అయిఉండేది. విలీనం కోసం నాలుగు నెలల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దక్షిణాఫ్రికా అగ్రగామి టెలికాం సంస్థతో ఈ ప్రతిపాదనను విరమించుకున్నట్లు భారతి ఎయిర్ టెల్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. గత రెండేళ్ళలో ఈ విధంగా జరగడం ఇది రెండోసారి. ఒప్పందం ప్రతిపాదన రద్దయిన నేపథ్యంలో తమ షేర్ల ట్రేడింగ్‌ను ఒకరోజు పాటు నిలిపివేయాల్సిందిగా ఎంటీఎన్ కోరింది.
రద్దు గురించి తమ దేశ ప్రభుత్వానికి తెలియజేసినట్లు కూడా పేర్కొంది. రెండు దేశాల ప్రభుత్వాలు సైతం ఈ విలీనంపై సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వెలువడిన తరుణంలో ఈ ప్రతిపాదన రద్దు కావడం విశేషం. రెండు సంస్థలూ విలీనమై ఉంటే ఆ నూతన సంస్థ ఏటా 20 బిలియన్ డాలర్ల ఆదాయంతో, 200 మిలియన్లకు పైగా సబ్‌స్క్రిప్షన్ బేస్‌తో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద టెలికాం సంస్థ అయ్యుండేది. ఒప్పందంలో పేర్కొన్న విధంగా సంస్థ నిర్మాణాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆమోదించకపోవడమే ఈ ప్రతిపాదన రద్దుకు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. తమదేశానికి చెందిన సంస్థగా ఎంటీఎన్‌కు డ్యూయల్ లిస్టింగ్‌ను దక్షిణాఫ్రికా కోరుకున్నది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం, ఎంటీఎన్‌లో 49 శాతం వాటాను భారతి పొందాల్సి ఉంది. అదే సమయంలో ఎంటీఎన్ సంస్థ భారతిలో 36 శాతం వాటాను పొందేది.
News Posted: 1 October, 2009
|