కారు చౌకగా మొబైల్ ఛార్జీలు
న్యూఢిల్లీ : మొబైల్ యుద్ధం భయంకరంగా మారుతోంది. సెల్ ఫోన్ వినియోగదారులు రాబోయే కాలంలో మరింత లాభదాయకమైన ఆఫర్లను మొబైల్ ఆపరేటర్ల నుంచి అందుకోనున్నారు. వినియోగదారులను ఆకర్షించడంతో పాటు వారిని పక్క సర్వీసులకు పోకుండా కాపాడుకోడానికి మొబైల్ కంపెనీలు ఛార్జీలను తగ్గించే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే మొబైల్ టెలిఫోన్ ఛార్జీలను యాభై శాతం తగ్గించిన కంపెనీలు రానున్న రెండు మూడు నెలల్లో మరో పాతిక శాతం కూడా తగ్గించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ సంవత్సరాంతానికి మొబైల్ సర్వీసు మార్కెట్ లోకి కొత్తగా ఐదు కంపెనీలు రాబోతున్నాయి. ప్రస్తుతం 45 కోట్లు ఉన్న మొబైల్ వినియోగదారుల సంఖ్య 2012 నాటికి 75 కోట్లకు చేరుతారని అంచనాలున్న నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఎనిమిది కంపెనీలు తమ వినియోగదారుల వాటాను పెంచుకోడానికి ఏకైక మార్గంగా ఛార్జీల తగ్గింపు ప్రణాళికను అమలు చేయబోతున్నాయి.
గణనీయంగా ఛార్జీలను తగ్గించడం ద్వారా కొత్త కంపెనీల మార్కెట్ ను దెబ్బకొట్టడం ప్రధాన లక్ష్యమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రంగంలో ఉన్న కంపెనీలు నెట్ వర్క్ పై పెట్టుబడులు పెట్టి ఉన్నాయి. లాభాల్లో మార్జిన్ తగ్గినా పెద్దగా వచ్చే నష్టం ఉండదు. కానీ కొత్త కంపెనీలు మౌలిక సదుపాయాల కల్పనకు, నెట్ వర్క్ నిర్మించుకోడానికి పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టాలి. మార్కెట్లోకి ప్రవేశించాలంటే ఇప్పుడున్న ఛార్జీల ప్రకారమే వినియోగదారునికి సేవలు అందించాలి. లాభాల మార్జిన్ తక్కువగా ఉండటంతో అవి కుదేలయ్యే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వినియోగదారుడిని ఆకర్షించడానకి లేదా నిలబెట్టుకోడానికి ఛార్జీల తగ్గింపు ఒక్కటే మార్గం కాదని కూడా చెబుతున్నారు. నాణ్యమైన సేవలు అంటే మొబైల్ కనెక్టెవిటీ, సరైన సిగ్నల్ రావడం, నిజాయితీ బిల్లింగ్ వ్యవస్థ కూడా వినియోగదారుణ్ణి ఆకర్షిస్తాయని వివరిస్తున్నారు. టాటా టెలీ సర్వీసెస్ తన జిఎస్ ఎం సర్వీసు డుకొమా లో సెకనుకు పైసా బిల్లింగ్ పెడితే, రిలయన్స్ 50 పైసలకే నిముషం కాల్ ను అందుబాటులోకి తెచ్చి ఛార్జీల యుద్ధంలోకి అడుగుపెట్టింది. కొత్తగా రాబోతున్న సిస్టమ శ్యామ్ టెలిసర్వీసెస్ ఎంటిఎస్ బ్రాండ్ పేరుతో రంగంలోకి వచ్చి రెండు సెకన్లకు పైసా ఛార్జీ తో సెకన్ కాల్ ఛార్జీని 30 పైసలకే అందివ్వడానికి సంసిద్ధమైంది. కాకపోతే ఈ ప్లాన్ లో రోజుకు రూపాయిని వినియోగదారుడు అద్దెగా భరించవలసి ఉంటుంది. గతంలో డబ్భై పైసలుండే నిముషం కాల్ ఛార్జి ఇప్పుడు 30 పైసలకు తగ్గింది. మరో 20 శాతం కూడా తగ్గుతుందని సిస్టమ శ్యామ్ సిఇవో సెవాల్డ్ రొజనోవ్ చెప్పారు. ఈ కంపెనీ రష్యా సంయుక్త భాగస్వామ్యంలో దేశంలోకి అడుగుపెట్టింది.
ఇంతకంటే ఛార్జీలను తగ్గిస్తే కంపెనీలు నష్టాల్లో పడటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నష్టాలు వస్తాయని ఛార్జీలను తగ్గించకపోతే భారతదేశంలో వినియోగదారుణ్ణి నిలబెట్టుకోవడం కష్టమని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవడం ద్వారా లాభాల మార్జన్ ను స్థిరంగా నిలుపుకోవచ్చని వారు సూత్రీకరిస్తున్నారు. ఏదిఏమైన మొబైల్ వినియోగదారులు మరింత నాణ్యమైన సేవలను తక్కువ ధరలకే పొందే సౌలభ్యం కంపెనీల పోటీ కల్పించనుంది.
News Posted: 9 October, 2009
|