బ్యాంకులకు వెసులుబాటు!
న్యూఢిల్లీ : బ్యాంకు రుణ సౌకర్యం కల్పనకు సంబంధించిన నిబంధనలలో మార్పులు చేయవలసిందిగా బ్యాంకింగ్ పరిశ్రమ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ)కి విజ్ఞప్తి చేసింది. దీని వల్ల బ్యాంకుల వద్ద మరింతగా మూల ధనం ఉంటుంది. పరపతి విధానం సమీక్షకు ముందుగా సంప్రదాయం ప్రకారం అక్టోబర్ 12న బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆర్ బిఐతో జరిపిన సమావేశంలో బ్యాంకింగ్ పరిశ్రమ ఈ విజ్ఞప్తి చేసింది.
'ఒక్కొక్కసారి ఒక వ్యక్తి ఒకే సారి పలు రుణాలు - వ్యవసాయ రుణం, ఇంటి రుణం - తీసుకుంటుంటాడు. వేర్వేరు ఆదాయ వనరుల ద్వారా వాటిని తిరిగి చెల్లించాలని అతని సంకల్పం. కాని ఏదైనా కారణంగా ఒక ఆదాయ వనరు హరించుకుపోయిన పక్షంలో అతను ఒక రుణాన్ని బకాయి పెట్టి, రెండవ రుణాన్ని తెరిగి చెల్లిస్తుంటాడు. అటువంటి పరిస్థితులలో రెండు రుణాలను తిరిగి రాని రుణాలుగా పరిగణించడం కొంత దారుణంగా ఉంటుంది. అందువల్ల ఈ నిబంధనను పునఃపరిశీలించవలసిందిగా ఆర్ బిఐకి బ్యాంకులు విజ్ఞప్తి చేశాయి' అని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) 'ఫైనాన్షియల్ క్రానికల్' విలేఖరితో చెప్పారు.
ఆర్ బిఐ కనుక ఈ అభ్యర్థనకు అంగీకరించినట్లయితే, బ్యాంకుల వద్ద మరింత మూలధనం ఉంటుంది. అదే సమయంలో ఏదో ఒక రుణాన్ని బాకీ పెట్టిన కస్టమర్లను మొండి బకాయిదారునిగా పేర్కొనకపోవచ్చు.
ఏ కస్టమర్ అయినా ఒక రుణాన్ని సక్రమంగా తిరిగి చెల్లిస్తూ రెండవ రుణాన్ని బాకీ పెట్టినప్పటికీ సదరు కస్టమర్ కు బహుళ రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిధులు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. దీని వల్ల నిధులు సమకూర్చే నిబంధనలను పాటించేందుకు గణనీయంగా మూలధనాని బ్యాంకులు ప్రత్యేకించవలసి వస్తుంది. దీని వల్ల బ్యాంకుల వద్ద రుణాలు ఇవ్వడానికి తగినన్ని నిధులు ఉండవు.
'ఇప్పుడు అమలులో ఉన్న నిబంధన వల్ల బ్యాంకులకు రుణం ఇచ్చే సామర్థ్యం తగ్గుతుంది. ఏ కస్టమర్ అయినా ఒక రుణాన్ని బాకీ పెట్టినట్లయితే, సక్రమంగా తిరిగి చెల్లిస్తున్న రుణాలను కూడా మొండి బకాయిగా బ్యాంకులు పరిగణించి తగు ఏర్పాట్లు చేసుకోవలసిన అవసరం ఉంటున్నది' అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్.పి. అగర్వాల్ తెలిపారు.
News Posted: 20 October, 2009
|