టాటాలకు 'నానో'ల సెగ
న్యూఢిల్లీ : 'వండర్' కారు నానో రోడ్లపై నడవడం మొదలైనప్పటి నుంచి అంతా సాఫీగా సాగిపోతున్నదనే భావనకు ఈమధ్య కాలంలో జరిగిన మూడు సంఘటనలు విఘాతం కలిగిస్తున్నాయి. గడచిన నెల రోజులలో నానో కారులో మంటలు లేచిన సంఘటనలు మూడు సంభవించడాన్ని పరిగణనలోకి తీసుకుంటూ టాటా మోటార్స్ సంస్థ ఇంత వరకు పంపిణీ చేసిన 7500 నానో కార్లపై ముందస్తుగా ఆడిట్ తనిఖీ చేయించనున్నట్లు బుధవారం ప్రకటించింది.
క్రితం నెల అహ్మదాబాద్ లో ఒక నానో కారులో మంటలు లేచాయి. ఆతరువాత మంగళవారం లక్నో, ఢిల్లీ నగరాలలో అటువంటివే రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనితో ఆ కారు భద్రతపై తీవ్రమైన అనుమానాలు రేకెత్తున్నాయి. తన కుమార్తె మంగళవారం మధ్యాహ్నం తమ ఇంటి వెలుపల కారును నిలిపి ఉంచిందని, కాని మూడు గంటల తరువాత కారు అగ్ని జ్వాలల్లో చిక్కుకున్నదని ఢిల్లీ వాసి సునీల్ కుమార్ పన్వండా తెలియజేశారు. ఆయన టాటా సంస్థపై ఆగ్రహంతో ఉన్నారు. 'నా పిల్లల కోసం నేను ఆ కారు కొన్నాను. కాని వారు ఇప్పుడు దానిని నడపాలంటే భయపడిపోతున్నారు' అని పన్వండా 'సిఎన్ బిసి టివి18' చానెల్ విలేఖరితో చెప్పారు. 'కంపెనీ నా డబ్బు తిరిగి ఇచ్చి వాహనాన్ని వాపసు తీసుకోవాలని కోరుతున్నాను' అని ఆయన చెప్పారు.
అహ్మదాబాద్ వాసి రవీంద్ర భగత్ కూడా ఇటువంటి అనుభవమే ఎదుర్కొన్నారు. పెద్ద కారే నయమనే భావనతో ఆయన ఇప్పుడు ఉన్నారు. 'నేను ఈ చిన్న కారును కొన్నానంటే రతన్ టాటా నడిపి, దీనిని ప్రవేశపెట్టడమే కారణం. నగరంలో రోజువారీ వాడకానికి ఈ చిన్న కారు అనువైనదని భావించాను. కాని ఇప్పుడు పెద్ద కారును నడపడమే శ్రేయస్కరమని భావిస్తున్నాను. ఈ కారును మార్చి వేరే కారు నాకు ఇచ్చినా నేను దీనిని స్వీకరించను' అని రవీంద్ర భగత్ చెప్పారు.
అయితే, టాటా సంస్థ ఈ సంఘటనలకు అంత ప్రాముఖ్యం లేదని చెబుతున్నది. కారులో సాంకేతిక లోపం గాని, డిజైన్ లోపం గాని లేదని, షార్ట్ సర్క్యూట్ లు మాత్రమే ఉన్నాయని సంస్థ స్పష్టం చేసింది. 'న్యూఢిల్లీలోని కారు మా వద్దకు ఇంకా రాలేదు. కాని లక్నో, అహ్మదాబాద్ లలోని కార్లకు మరమ్మతులు చేశాం. కారులోని కాంబినేషన్ స్విచ్ ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ మాత్రమే ఉన్నది' అని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి దేవాశీస్ రే 'హిందుస్థాన్ టైమ్స్' పత్రిక విలేఖరితో చెప్పారు. 'కారులో సాంకేతిక లోపం గాని, డిజైన్ లోపం గాని ఏదీ లేనందున కార్లు వేటినీ తిరిగి రప్పించుకునే ప్రసక్తే లేదు. ఇది మూల స్థానం సమస్య కాదు' అని ఆయన స్పష్టం చేశారు.
News Posted: 22 October, 2009
|