ఆర్బిఐ రేట్లు యథాతథం
ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) చట్టబద్ధమైన ద్రవ్య వినియోగ (లిక్విడిటీ) పరిమితి (ఎస్ఎల్ఆర్)ని వంద బేసిస్ పాయింట్ల మేర 25 శాతానికి మంగళవారం పెంచింది. ప్రభుత్వ సెక్యూరిటీలలో బ్యాంకులు మదుపు చేయవలసి ఉన్న డిపాజిట్లలో ఇది భాగం. అయితే, కీలకమైన ఇతర రేట్లను, రెపో, రివర్స్ రెపో, క్యాష్ రిజర్వ్ రేషియో (సిఆర్ఆర్) వంటి నిష్పత్తులను ఆర్ బిఐ యథాతథంగా ఉంచింది.
పరపతి విధానంపై రెండవ త్రైమాసిక సమీక్షలో భాగంగా ఎస్ఎల్ఆర్ ను పెంచాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ద్రవ్య వినియోగాన్ని తగ్గించడం, ద్రవ్యోల్బణ అంచనాలను నియంత్రించడం లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం పెరగసాగిన విషయం విదితమే. ముఖ్యంగా ఆహార వస్తువుల విషయంలో ఈ ధోరణులు కనిపిస్తున్నాయి.
ఆర్ బిఐ పరపతి విధానంలో ప్రధానాంశాలు : చట్టబద్ధమైన ద్రవ్యవినియోగ పరిమితిని 100 బేసిస్ పాయింట్ల మేర 25 శాతానికి హెచ్చించారు. కీలకమైన ఇతర రేట్లు యథాతథంగా కొనసాగిస్తారు. 2010 ఆర్థిక సంవత్సరానికి సూచించిన స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధిని 6 శాతం మేర కొనసాగిస్తారు. మార్చి మాసాంతానికి ద్రవ్యోల్బణం 6.5 శాతానికి పెరుగుతుందని అంచనా. ద్రవ్యోల్బణాన్ని 4 నుంచి 4.5 శాతం మధ్య అదుపు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. జనవరిలో మూడవ త్రైమాసిక సమీక్షను రిజర్వ్ బ్యాంక్ ప్రకటిస్తుంది.
News Posted: 27 October, 2009
|