రిల్ ను నిలదీసిన సుప్రీం
న్యూఢిల్లీ : 'ప్రజా ప్రయోజనాల' దృష్ట్యా గ్యాస్ ను మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబిటియు)కు 2.34 డాలర్లకు ఎందుకు విక్రయించరని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)ను సుప్రీం కోర్టు గురువారం ప్రశ్నించింది. అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ (ఆర్ఎన్ఆర్ఎల్)కు ఎంబిటియుకు 2.34 డాలర్ల ధరకు కృష్ణా-గోదావరి (కెజి) బేసిన్ లోని తమ క్షేత్రాల నుంచి గ్యాస్ ను సరఫరా చేయడానికి ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని ఆర్ఐఎల్ నిరాకరించింది. ఫలితంగా ఆర్ఎన్ఆర్ఎల్ ఆ సంస్థపై సుప్రీం కోర్టులో కేసు వేసింది.
'ప్రభుత్వమే అమ్మకం ధరను 2.34 డాలర్లుగా నిర్ణయించినట్లయితే అది ప్రజా ప్రయోజనాల కోసం కాదా? (తక్కువ గ్యాస్ ధరల కారణంగా) ఎరువులు, విద్యుత్, ఇంధనం అన్నీ చౌక అవుతాయి కదా. దేశానికీ లబ్ధి చేకూరుతుంది' అని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయం వెలిబుచ్చింది.
అమ్మకం ధరను యూనిట్ కు 4.2 డాలర్ల మేరకు ప్రభుత్వం నిర్థారించడంలో ఔచిత్యం ఏమిటో చెప్పండని కూడా సుప్రీం కోర్టు అడిగింది. 'అది చట్టబద్ధమైన ధరా? లేక కాంట్రాక్టు సంబంధితమా? ధరని నిర్ణయిస్తున్నప్పుడు ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నది' అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్.వి. రవీంద్రన్ ఆర్ఐఎల్ న్యాయవాది హరీష్ ఎన్. సాల్వేని ప్రశ్నించారు. ప్రభుత్వం పట్టుబట్టినట్లయితే 2.34 డాలర్ల ధరకు విక్రయించడం వినా ఆర్ఐఎల్ కు మార్గాంతరం ఉండదని, అయితే, అది ఆర్ఐఎల్ ప్రయోజనాలకు విరుద్ధమైనదని సాల్వే చెప్పారు.
కాగా సహజ వాయువుకు దేశంలో ఒకేవిధమైన ధరను నిర్థారించే అవకాశాన్ని పరిశీలించేందుకు స్పెయిన్ కు చెందిన స్పెషాలిటీ కన్సల్టెన్సీ సంస్థ మెర్కడోస్ ఎనర్జీ మార్కెట్స్ ఇంటర్నేషనల్ ను ప్రభుత్వం నియమించింది. గ్యాస్ ఉత్పత్తి జరిగే ప్రదేశాన్ని బట్టి దీనిని ప్రస్తుతం ఎంబిటియుకు ఒక డాలర్ నుంచి 5.73 డాలర్ల మధ్య ధరకు విక్రయిస్తున్నారు. ఈ రేట్లను ఏకీకృతం చేయాలనేది పెట్రోలియం శాఖ కార్యదర్శి ఆర్.ఎస్. పాండే ఆలోచన.
News Posted: 30 October, 2009
|