పసిడికి రెక్కలు!
హైదరాబాద్ : పది గ్రాముల బంగారం ధర బుధవారం ఒక్కరోజులోనే అనూహ్యంగా 350 రూపాయలు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 24 క్యారట్ల తులం బంగారం 16,750 రూపాయలు, 22 క్యారట్ల ధర 16,430 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు చుక్కలను అంటడంతో దేశీయంగానూ వాటి ధరలు ఆకాశానికి దూసుకుపోయాయి. డాలర్ మారకం విలువ తగ్గడంతో ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరకు రెక్కలొచ్చాయి. ప్రపంచ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1,091 డాలర్లు పలుకుతోంది. కాగా హైదరాబాద్ లో బుధవారంనాడు వెండి ధర కిలోకు 7 వందల రూపాయలు పెరిగి 27,400 రూపాయలు పలికింది.
డాలర్ మారకం ధర తగ్గడంతో పాటు పెళ్ళిళ్ళ సీజన్ కూడా కావడంతో బంగారం, వెండి ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. మంగళవారం కూడా పది గ్రాముల బంగారం ధర 155 రూపాయలు పెరిగి 16,240 చేరింది. ఇదే బంగారం ధర సోమవారం 16,085 రూపాయలు పలికింది.
కాగా, బుధవారం ఒక్కరోజులోనే పసిడి పది గ్రాముల ధర మున్నెన్నడూ లేని విధంగా 350 రూపాయలు పెరగడంతో సాధారణ ప్రజలు దాని జోలికి పోయే పరిస్థితి లేదని వాపోతున్నారు. బంగారం పట్ల భారతీయులకు ఉన్న మోజు కూడా పసిడి ధర ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి కారణంగా నిలుస్తోందనడంలో సందేహం లేదు.
News Posted: 4 November, 2009
|