ఇక 'మనసు' నోకియా
న్యూఢిల్లీ : మీ వేలి ముద్రలను గుర్తు పట్టేస్తుంది... మీ గొంతునూ ఇట్టే పసిగట్టేస్తుంది...మీ ముఖాన్నీ గుర్తించేస్తుంది... ఇంకా మీ మొబైల్ ఫోను ఏవేం చేయాలి? కనెక్టింగ్ పీపుల్ అంటూ ప్రపంచంలోని అన్నిదేశాల మానవులను కలుపుతున్న 'నోకియా' దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. అదే మీ మనసులోని భావాలను కనిపెట్టేయడం. దానికి అనుగుణంగా సేవలు అందించడం. ఇలాంటి వినూత్న మొబైల్ ఫోనులను తయారు చేయడంలో నోకియా తలమునకలై ఉంది. హేండ్ సెట్ ఉపయోగించే వ్యక్తి మనసులోని భావాలను కనిపెట్టి దానికి అనుగుణంగా అప్పటికప్పుడు సమాచారం అందించడం దీని ప్రత్యేకత.
ఉదాహరణకు మీరు ఈ మొబైల్ ఫోనును ఆకాశం వైపు పెట్టారనుకోండి. మీరు వాతావరణం గురించిన సమాచారాన్ని అడుగుతున్నారని తెలుసుకుని దానికి సంబంధించిన బులిటెన్ ను స్క్రీన్ పై చూపిస్తుంది. ఏదైనా మీకు నచ్చని కాల్ వచ్చినుకోండి ఫోన్ వంక ఒకసారి కోపంగా చూస్తే చాలు దానిని వెంటనే తిరస్కరిస్తుంది. ఈ ఆలోచన అనేక అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. కానీ నోకియా ప్రస్తుతానికి మానవునికి సంబంధించి అరవై భావాలను గుర్తించే వరకే పరిమితమవుతోంది. వీటన్నింటినీ కూడా మొబైల్ ఫోన్ లో పెట్టబోవడం లేదు. ఎందుకంటే ప్రపంచంలో మానవ భావాలు, సంజ్ఞలకు సంబంధించి వైరుధ్యాలు ఉన్నాయని నోకియా సీనియర్ డిజైన్ స్పెషలిస్ట్ యూఘీ జంగ్ చెప్పారు. తాము ప్రస్తుతం వివిధ దేశాలలో ప్రజల అవసరాలను వారి ప్రవర్తనను అర్ధం చేసుకునే పనిలో ఉన్నామని ఆమె వివరించారు.
ఈ టెక్నాలజీని రూపొందించడం సవాలుతో కూడుకున్నదేనని ఆమె అన్నారు. నోకియా మొబైల్లో మేం అమర్చే భావం గుర్తింపు విధానం ప్రపంచ ప్రజలందరికీ పనకి వచ్చేదిగా వారి ఆమోదం పొందేదిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఒక దేశంలో ఒకలాంటి భావవ్యక్తీకరణ లేదా సంజ్ఞ గౌరవంగా భావిస్తే దానినే మరో దేశం లేదా ప్రాంతం వారు అమర్యాదగా చూడవచ్చని ఆమె వివరించారు. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి నోకియా బృందం 14 దేశాలలో పరిశీలనలు జరుపుతోంది. ఇప్పటికే ఈ బృందం ముంబయి, షాంగై, షికాగో, లండన్ వాసులను కలిసి వారి భావ వ్యక్తీకరణను అధ్యాయం చేసింది. టైం తెలుసుకోవడం, మెస్సేజ్ కు సమాధానం పంపడం, అనవసర కాల్ ను కట్ చేయడం వంటి సాధారణ భావాలను గుర్తించారు. త్వరలోనే ఈ ఫోన్ లు మార్కెట్ లోకి రాబోతున్నాయి. కొత్తలో ధరలు పేలిపోయే అవకాశం ఉంది కాని మనసు తెలసుకుని సేవలందించే హేండ్ సెట్ లకు గిరాకీ మాత్రం భలేగా ఉంటుందని నోకియా భావిస్తోంది.
News Posted: 6 November, 2009
|