హార్వర్డ్ కు ప్రీతి జింటా
ముంబాయి : వయసు మీద పడుతున్నప్పుడు అనేక మంది నటీమణులు కొత్త దారులు వెతుక్కొని, వెండితెర నుంచి తప్పుకున్న విధంగానే ప్రీతి జింటా ముందుకు సాగుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమానురాలైన ప్రీతి జింటా... క్రీడా వ్యాపారంలో మరింతగా రాణించేందుకు చిట్కాల కోసం హార్వర్డ్ యూనివర్శిటీలో విద్యార్థిని అవతారం ఎత్తనున్నారు. బాలీవుడ్ కు చెందిన నటీనటుల సంతానం విదేశాల్లో విద్య అభ్యసించడం... డిగ్రీలు సంపాదించడం కొత్తేమీ కాదు. అమర్త్యసేన్ వంటి ఆర్థికవేత్తలు అధ్యాపకులుగా పనిచేస్తున్న హార్వర్డ్ బిజినెస్ స్కూలులో వాణిజ్య పాఠాలను వంటబట్టించుకునేందుకు జింటా ప్రయత్నిస్తున్నారు.
వచ్చే జనవరి 24-29 మధ్య వారం పాటు హార్వర్డ్ లో కోర్స్ అభ్యసిస్తారు. ఇప్పటికే అంగీకారం కుదిరిందని జింటా సహాయకుడు ఒకరు వెల్లడించారు. 'ఈ కోర్సుకు హాజరయ్యేందుకు ఆమె 10వేల డాలర్లు చెల్లించారు. ఆమె అక్కడే హాస్టల్లో ఇతర విద్యార్థులతో పాటు గడుపుతారు' అని సహాయకుడు వివరించారు.
ఐపీఎల్ భాగస్వామి, బాంబే డైయింగ్ వారసుడు నెస్ వాడియాతో విభేదాల అనంతరం జింటా ఎక్కువగా తన సోదరుని కుటుంబంతోనే గడిపారు. హార్వర్డ్ లో వ్యాపార సంబంధమైన కోర్స్ అధ్యయనం వల్ల.. వ్యాపార ఒప్పందాల్లో పై చేయి సాధించేందుకు అవసరమైన చిట్కాలు, విధానాల్లో ఆమె అవగాహన పెంచుకుంటారు! ఇదంతా కూడా ఆమె తలపెట్టిన కొత్త క్రీడా వాణిజ్య ప్రాజెక్టుల విజయవంతానికి సహాయకారి కాగలదు. మరో పక్కన ప్రీతి జింటా 'డ్రీమ్ గర్ల్' పేరిట అంతర్జాతీయ గర్ల్స్ బాస్కెట్ బాల్ టీమ్ ను ఏర్పాటు చేయనుంది. ఈ జట్టులో అంతర్జాతీయ మహిళా నటులు, క్రీడాకారిణులు, మోడల్స్, ప్రముఖ వ్యక్తులు ఉంటారు. జింటా నాయకత్వంలో పనిచేసే ఈ జట్టు సభ్యులకు క్రీడా శిక్షణ ఇస్తారు. ప్రపంచంలోని బాస్కెట్ బాల్ క్రీడాకారుల జట్టులతో ఈ జింటా జట్టు తలపడుతుంది. ఈ ప్రాజెక్టు విజయవంతానికి టెలివిజన్ ఛానల్ ను ఆశ్రయిస్తారు. ఇందుకోసం ఆమె ఒక రియాల్టీ షోలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ 34 సంవత్సరాల భామ క్రికెట్ ఆధారంగా సొంతంగా ఒక టెలివిజన్ షోని నిర్మించనున్నారు.
News Posted: 7 November, 2009
|