చేతివాటంలో భారత్ ఫస్ట్!
రిటైల్... అలియాస్ 'చిల్లర'ని తక్కువగా అంచనా వేయవద్దు. చిల్లర డబ్బులను శ్రీ మహాలక్ష్మిగా కొలిచినట్లుగానే... చిల్లర చోరీలే బెస్ట్ అంటున్నారు చిల్లర దొంగలు! ఈ చిల్లర దొంగతనాల విషయంలో ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్ గా ఉన్నట్లుగా 'రిటైల్' దుకాణాల్లో చోరీలపై జరిగిన ప్రపంచస్థాయి అధ్యయనం చాటుతోంది. ఇంతలావు వ్యాపారాల్లో కొనుగోలు దారుల హస్తలాఘవం, సిబ్బంది చేతివాటం వల్ల నష్టం వస్తుందంటే నమ్మడం కష్టమే. ఇదంతా పంట పొలంలో మిగిలిపోయిన వరి కంకులతో సమానం అనుకుంటాం. కానీ ఇది నష్టాల్లో ఎక్కువగానే ఉంటుందనేది ఈ అధ్యయనాల్లో తేలింది.
కోటీశ్వరులైనా షాపింగ్ కు వచ్చినప్పుడు ఎదో చిన్నదైన ఖరీదైన వస్తువును లాఘవంగా పట్టుకుపోతారు. అది వారికి హబీ. చిల్లర నష్టంలో భారత్ ముందంజలో ఉంటే... హాంకాంగ్ (o.92 శాతం), తైవాన్ (0.89) తక్కువ స్థాయి నష్టంతో ఉన్నట్లు తెలుస్తోంది. సరుకు సరఫరా చేయడంలో అవినీతి, లెక్కలు రాయడంలో పొరపాటు, పనివాళ్ళ చోరీ, చిల్లర దొంగల హస్త లాఘవం వల్ల ఈ నష్టం సంభవిస్తున్నట్లుగా అంచనా. దేశంలో 200 కోట్ల అమెరికన్ డాలర్ల విలువైన సంపద నష్టం వాటిల్లిందని అంచనా. మూడవ ప్రపంచ చిల్లర చోరీ గణన - 2009 ప్రకారం 2008 జూలై నుంచి 2009 జూన్ వరకు జరిగిన సర్వేలో 1069 పెద్ద పెద్ద రిటైల్ సంస్థల్లో సర్వే చేశారు.
ఎలక్ట్రానిక్ వస్తువులు, నగల అలంకరణ, మేకప్ కిట్, గార్మెంట్స్ అంటే మక్కువ లేనిదెవరికి. అందుకే చిల్లర చోరీల్లో కూడా వీటికే ఆదరణ అధికమట. అందుకనే కేటుగాళ్ళంతా ఎలక్ట్రానిక్ సామాగ్రి, మధువు, దుస్తులు, నగలను చోరీ చేయడానికి మక్కువ చూపుతున్నారు. ఇందుకు కారణం వాటి విలువతోపాటు, సులభంగా తరలించుకుపోవడానికి అవకాశం ఉండటమే. అంతర్జాతీయ స్థాయిలో చోరుల బారిన పడే జాబితాలో లేజర్ బ్లేడ్ లు, వాచీలు, డీవీడీలు ఉన్నాయి. ఈ వస్తువులను తేలికగా దొంగతనం చేయడానికి వీలవుతుందని విజయ్ సేల్స్ కు చెందిన మేనేజింగ్ పార్టనర్ నిలేష్ గుప్తా చెప్పారు. అదే విధంగా ఎంపీ - 3 ప్లేయర్లు, సెల్ ఫోన్ లను ఎక్కువగా చోరీ చేస్తున్నారని తెలిపారు. భారత్ దుకాణాల్లో 45 శాతం వాటా చేతివాటానిదే. ఇది ప్రపంచ సగటు నష్టం 43 శాతం కన్నా ఎక్కువ. ఇక ముంబాయిలోని నగల దుకాణాల్లో హస్తలాగవ ప్రదర్శన వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. వీరంతా ఒక గ్యాంగ్ గా ఏర్పడి చోరీలకు పాల్పడుతారు. కొన్ని సందర్భాల్లో కత్తుతో బెదిరిస్తారని ఇటీవల ముంబాయిలో చోరీకి గురైన నగల దుకాణం యజమాని ఒకరు చెప్పారు.
రిటైల్ అమ్మ కాల్లో 0.19 శాతం ఉంటే 1.58 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన డమ్మీ మోడల్స్ కూడా నష్ట పోతున్నట్లు తెలిపారు. వినియోగదారుల చేతివాటం తరువాత ఉద్యోగుల చోరీలవల్ల 23.3 శాతం నష్టం జరుగుతుందన్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్టు హస్తలాఘవం ఉన్నవారిని గుర్తించడం ఎవరికైనా కష్టమేనని 'బ్యూటీ ప్యాలెస్' యజమాని ఇర్ఫాన్ భామ్లా అంటున్నారు. దుకాణాల్లో పని వారల దొంగతనాలను అరికట్టడం కన్నా కొనుగోలు చేసేందుకు వచ్చి.. చేతివాటంగాళ్ళను పట్టుకోవడం తేలికగా ఉంటుందన్నారు. ఆసియా ఫసిఫిక్ దేశాల్లో చేతివాటం దొంగలవల్ల కలిగే నష్టం కన్నా ఉద్యోగుల చోరీవల్ల సంభవించే నష్టం ఐదు రెట్లు ఎక్కువని అంచనా. ఇంటి దొంగల గుట్టు రట్టు చేయడం కష్టమే అయినా... భద్రత కోసం గార్డుల్ని ఆశ్రయించక తప్పడం లేదు. చెక్ పాయింట్ సిస్టమ్స్ కంట్రీ మేనేజర్ ధర్మేష్ లాంబే మాట్లాడుతూ దొంగలను కనిపెట్టేందుకు క్లోజ్ డ్ సర్క్యూట్ టీవీ విధానాలను అనుసరిస్తున్నారని చెప్పారు. అయినా... నష్టం మాత్రం ఎక్కడో ఓ చోట తప్పడం లేదంటున్నారు.
News Posted: 11 November, 2009
|