కొండెక్కిన బంగారం
ముంబయి : బంగారం ధర పెరుగుతూనే ఉంది. అది పదిహేడు వేల రూపాయలను దాటేసి సచిన్ టెండూల్కర్ పరుగుల రికార్డులా పెరిగిపోయింది. గురువారం ఒక్కరోజే 10 గ్రాములపై 170 రూపాయలు పెరిగి 17 వేల 150 రూపాయల వద్ద ఆగింది. వివాహాల సీజన్ కావడంతో ప్రజలు ఎగబడి బంగారాన్ని కొనడమే పెరుగుదలకు కారణమని చెబుతున్న అంతర్జాతీయంగా కూడా పసిడి ధర పెరిగింది. అలానే వెండి ధర కూడా కేజీ పై 220 రూపాయలు పెరిగి 27 వేల 720 రూపాయలుగా స్థిరపడింది. బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి భారత రిజర్వ్ బ్యాంకు రెండు వందల టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినప్పటి నుంచి ధర పెరుగుతోందని చెబుతున్నారు.
ఈ యేడాది ప్రారంభం రోజున అంటే జనవరి ఒకటో తేదీన పది గ్రాముల బంగారం ఖరీదు 13 వేల 650 రూపాయలుగా ఉంది. అంటే గడచిన ఈ పదకొండు నెలల్లో దాదాపు మూడు వేల 350 రూపాయలు పెరిగిపోయింది. అంతెందుకు పదిహేను రోజుల క్రితం 16 వేల 150 గా ఉండేది ఈ పక్షం రోజుల్లోనే వెయ్యి రూపాయలు పెరిగింది. స్వచ్చమైన బంగారం ధర 17వేల 150 కాగా ఆభరణాల బంగారం 17 వేల రూపాయలకు అమ్ముడవుతూ అల్ టైమ్ రికార్డుగా నిలిచింది. ఎనిమిది గ్రాముల గోల్డ్ కాయిన్ ధర కూడా పెరిగి 13 వేల 425 రూపాయలకు అమ్ముడైంది. అలానే అమెరికాలోని న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజ్ లో బంగారం ధర 0.8 శాతం పెరిగి 1,123.40 డాలర్లు అయింది. వెండి ధరలు కూడా బంగారాన్నే అనుసరిస్తున్నాయి.
News Posted: 12 November, 2009
|