నూరంతస్థులు ఇప్పుడే కాదు
హైదరాబాద్ : అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్ (ఆర్ఇఎల్) చేపట్టనున్న 100 అంతస్తుల ట్రేడ్ టవర్ ప్రాజెక్టు గడువు మరో రెండు సంవత్సరాలు పొడిగించారు. ఆర్థిక మాంద్యం ప్రభావం కారణంగా ఆర్ఇఎల్, ఎపి పారిశ్రామిక మౌలిక వసతుల కార్పొరేషన్ (ఎపిఐఐసి) సంయుక్తంగా చేపట్టుతున్న ప్రాజెక్టు గడువును మార్చాలని గురువారం నిర్ణయించారు. మొదట కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఈ ప్రాజెక్టు పనిని 2009 డిసెంబర్ లో ప్రారంభించవలసి ఉంది.
ఈ ప్రాజెక్టును చేపట్టడానికి తాము 'కట్టుబడి ఉన్నామ'ని అనిల్ అంబానీ ఎపిఐఐసికి వాగ్దానం చేసినట్లు, అయితే, ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా వెంటనే ప్రాజెక్టు చేపట్టలేమని సూచించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఇప్పుడు ఎపిఐఐసి ఈ ట్రేడ్ టవర్ ప్రాజెక్టుపై డోలాయమాన స్థితిలో ఉంది. రూ. 6288 కోట్ల పెట్టుబడితో 70 ఎకరాలలో నిర్మించదలచిన ప్రతిష్ఠాకరమైన ఈ ప్రాజెక్టు ఇది. దీని కోసం ఎకరానికి రూ. 6.57 కోట్ల చెల్లించి ఆర్ఇఎల్ హస్తగతం చేసుకున్నది. దీనిపై ఎపిఐఐసి ప్రతినిధి మాట్లాడుతూ కంపెనీ ఇప్పటికే రూ. 170 కోట్లు చెల్లించింది. మేము ప్రాజెక్టును రద్దు చేసిన పక్షంలో ఆ మొత్తాన్ని వాపసు చేయవలసి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఈ చెల్లింపు కష్టం కాగలదు' అని అన్నారు.
ఒకవేళ ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసినప్పటికీ ఆ స్థలాన్ని తిరిగి అమ్మడం కష్టం కాగలదు. రెండు సంవత్సరాల క్రితం ఆర్ఇఎల్ చెల్లించిన ధర కన్నా ఇప్పుడు స్థలం విలువ సగం కన్నా తక్కువని ప్రాజెక్టు ఆర్థిక విషయాల కన్సల్టెంట్లు లెక్క గట్టారని అధికార వర్గాలు తెలిపాయి. అందువల్ల సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం ప్రాజెక్టు గడువును పొడిగించేందుకు ప్రభుత్వం చివరకు అంగీకరించింది. టవర్ నిర్మాణానికి 30 ఎకరాలను కార్పొరేషన్ ఇవ్వజూపి మిగిలిన 40 ఎకరాలలో వాణిజ్య సంస్థల సముదాయాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. కాని ఆర్ఇఎల్ ఎంతో ఉత్సాహంగా మొత్తం 70 ఎకరాలకు మొదటి వాయిదా సొమ్ము చెల్లించింది.
News Posted: 20 November, 2009
|