బీమాతో చచ్చేంత ముప్పు!
న్యూఢిల్లీ : భవిష్యత్ జీవితం భద్రంగా ఉండటానికి, ధీమాగా బతికేయడానికి బీమా పాలసీ తీసుకుంటున్నారా? మీ బతుకు ఇప్పుడే బుగ్గి పాలైయిపోయే ప్రమాదం ఉంది. మీకు తెలియకుండానే మీరు తాలిబన్ లేదా ఆల్ కాయిదా ఉగ్రవాది జాబితాలో చేరిపోవచ్చు. అక్కడి నుంచి భారతదేశంలో ఉన్న అన్ని రకాల పోలీసు వ్యవస్థలూ మిమ్మల్ని నుంచుని నీరు, కూర్చుని కూడు తినకుండా చేసేయవచ్చు. మీ ఖర్మ కాలిపోతే కటకటాల పాలవ్వొచ్చు. అంతా పేరు మహిమే. కొంపతీసి మీ పేరు అబ్దుల్ మానన్, అబ్దులు రజాక్, మహ్మద్ సలీమ్ గాని అయ్యిందంటే సలహా ఒక్కటే... మీరు బీమా పాలసీల జోలికి పోకండి. ఎందుకంటే బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ(ఇర్డా) దేశంలోని అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఒక పేర్ల జాబితాను రహస్యంగా పంపింది. తాలిబన్, ఆల్ కాయిదా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నవిగా భావిస్తున్న వారి పేర్ల జాబితా అది. ఆ జాబితాలోని పేరుతో మీ పేరు గాని సరిపోలిందో మీ పని గోవిందో గోవింద!
మీరు వేల రూపాయలు కట్టి కొన్న బీమా పాలసీని నిలుపుచేయడమే కాదు, మీ పేరును వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి కార్యాలయానికి పంపించేస్తారు. అలా పంపే ముందు కనీసం మీకు చెప్పను కూడా చెప్పరు. మీకు తెలియకుండానే మీ మీద ఉగ్రవాది ముద్ర పడిపోతుంది. ఇర్డా పంపిన జాబితాలో నిషేధిత ఉగ్రవాద సంస్థల పేర్లతో పాటు వాటితో సంబంధాలున్న 504 మంది పేర్లు కూడా ఉన్నాయి. ఎవరైనా సరే బీమా పాలసీ తీసుకున్న వెంటనే సదరు కంపెనీ తన దగ్గర ఉన్న జాబితాలో ఆ పేరు ఉందో లేదో చూస్తుంది. ఈ జాబితాను ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో సవరిస్తూ ఉంటారు.
ఈ జాబితాలో ఉన్న మరికొన్ని పేర్లు ఏమిటంటే అబ్దుల్ రెహ్మాన్, అబ్దుల్ కబీర్, మహ్మద్ హసన్, అబ్దుల్ హక్, రికార్డో. పాలసీ కొన్నవారి పేరుగాని ఈ జాబితాతో సరిపోతే వెంటనే ఆ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియచేస్తామని, సంఘ వ్యతిరేక నిరోధక చట్టం(యుఎపిఎ) నోడల్ అధికారికి, ఇర్డా ఆర్ధిక నిఘా విభాగానికి కూడా సమాచారం అందిస్తామని హెడిఎఫ్ సి స్టాండర్డ్ లైఫ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పరేష్ పరస్నిస్ తెలిపారు. ఈ జాబితా ఇటీవలే తమకు వచ్చిందని, ఉగ్రవాదులకు అక్రమ మార్గంలో డబ్బు వెళ్ళకుండా నిరోధించడానికే ఈ ప్రయత్నం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. జాబితాలో ఉన్న పేరుగల వ్యక్తి, పాలసీ తీసుకున్న వ్యక్తి ఒకరో కాదో తెలుసుకోడానికి రాష్ట్ర, కేంద్ర పోలీసులు రంగంలోకి దిగుతారని ఆయన వివరించారు.
పాలసీ తీసుకున్న పాపానికి ఉగ్రవాదని కాదని నిరూపించుకోలసిన బాధ్యత ఆ వ్యక్తిదే. ముప్పు తిప్పలూ పడైనా సరే... మూడు చెరువుల నీరు తాగైనా సరే... పాలసీదారుడు అన్ని రకాల ధృవపత్రాలు, సాక్ష్యాలు సమర్పించి తాను మంచివాడినని రుజువు చేసుకోవాలి. దర్యాప్తు అధికారులు సంతృప్తి చెందితే మీకూ, మీ పాలసీకి కూడా విముక్తి కలుగుతుంది. లేకపోతే .....?
News Posted: 21 November, 2009
|