అమెరికా 'అగ్గిపెట్టే'సింది
న్యూఢిల్లీ : అగ్గిపెట్టెల దిగుమతికి అమెరికా ఆంక్షలతోనూ, అదనపు పన్నులతోనూ అగ్గి పెట్టేసింది. స్థానికి పరిశ్రమలను అగ్గిపెట్టెల దిగుమతి దెబ్బకొట్టేస్తోందని, అందువల్ల స్థానిక పరిశ్రమలకు మేలు చేకూర్చడానికి భారతదేశం నుంచి దిగుమతి అవుతున్న అగ్గిపెట్టెలపై ఆంక్షలు విధించామని అమెరికా వాణిజ్య విభాగం ప్రకటించింది. ముంబయి నుంచి దిగుమతి అవుతున్న త్రివేణీ సేఫ్టీ మ్యాచెస్ కంపెనీ అగ్గిపెట్టెలపై అమెరికాకు చెందిన డిడి బీన్ అండ్ సన్స్ కంపెనీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన అమెరికా ప్రభుత్వం అగ్గిపెట్టెల దిగుమతిపై అదనపు సుంకాలు విధించాలని నిర్ణయించింది. అగ్గిపెట్టెలపై ప్రభుత్వ రాయితీలు ఉండటంతో త్రివేణీ అగ్గిపెట్టెలను అమెరికాలో అక్కడి ఖరీదు కంటే తక్కువకే అమ్ముతున్నారు. అమెరికాలో నిర్ధారించిన ధర కంటే ఇండియా అగ్గిపెట్టెలను చౌకగా అమ్మడం వలన స్థానిక పరిశ్రమలు నష్టపోతున్నాయని, అందువల్లనే భారత అగ్గిపెట్టెలపై దిగుమతి ఆంక్షలనే కాకుండా, అమెరికా ధరలతో సమానమయ్యే విధంగా అదనపు సుంకాలు విధిస్తున్నామని అధికారులు వివరించారు. తుది ఉత్తర్వులు ఈనెల 30 లోగా వస్తాయన్నారు.
News Posted: 24 November, 2009
|