బంగారం ధర ధగధగ
ముంబై : ద్రవ్యోల్బణం గురించి పెరుగుతున్న ఆందోళనలు, అమెరికన్ డాలర్ బలహీనత, ప్రస్తుత పెళ్ళిళ్ళ సీజన్ లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా బంగారం ధరలను దాదాపు రోజూ రికార్డు స్థాయిని చేరుకుంటున్నది. (ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన లోహాల వ్యాపారం జరిగే ప్రధాన కరెన్సీ అమెరికన్ డాలర్ కదా). సరిగ్గా ఒక వారం క్రితం మొట్టమొదటిసారిగా పది గ్రాములకు రూ. 17 వేల స్థాయిని దాటినప్పటి నుంచి బంగారం ధర దాదాపు రూ. 800 పెరిగింది. ఇది ఇప్పుడు రూ. 18 వేలకు కూతవేటు దూరంలో ఉంది.
సోమవారం స్టాండర్డ్ బంగారం ముగింపు ధర ఢిల్లీలో రూ. 17.810 కాగా ముంబైలో రూ. 17,610గా ఉన్నది. బంగారం ధరలకు అంతర్జాతీయ స్థాయి కొలబద్ద కనుక ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల కూడా దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు అధికం కావడానికి దోహదం చేసింది. సోమవారం బంగారానికి న్యూయార్క్ లో ఔన్స్ కు 1171 డాలర్ల మేరకు అధిక రేటు పలికింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) అంతర్జాతీయ మార్కెట్ లో 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించడం కూడా ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధర పెరుగుదలకు ఒక కారణమని పరిశ్రమ వర్గాలు వివరించాయి.
ఆర్ బిఐ ఇటీవల కొనుగోలు చేసిన బంగారం బ్యాంకు వద్ద గల నిల్వలలో భాగమైపోతాయి. అయితే, బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశంగా ఇండియా తన ఘనతను నిలబెట్టుకుంటున్నది. ఈ సంవత్సరం ఇంత వరకు అంతర్జాతీయంగా బంగారం ధరలు 32 శాతం పెరిగాయి. ఇవి చాలా సార్లు రికార్డును అధిగమించాయి కూడా. అంతర్జాతీయంగా బంగారం ధరలు రెండు నెలల్లో 1200 డాలర్ల స్థాయిని చేరుకోవచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి.
సంపదలో భాగమైన బంగారాన్ని ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం సమస్యలు రెండింటి నుంచి ఎప్పుడూ రక్షించేదిగా పరిగణిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మాంద్యం నుంచి బయటపడడంపై నెలకొన్న అనిశ్చితి కూడా బంగారం ధర పెరుగుదలకు కారణాల్లో ఒకటని పేర్కొంటున్నారు. అమెరికన్ డాలర్ తో భారతీయ కరెన్సీ మారకం విలువ పెరగకపోయినట్లయితే దేశంలో బంగారం ధర రూ. 18 వేల స్థాయిని తేలికగా దాటి ఉండేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గడచిన నెల రోజులలో డాలర్ తో రూపాయి మారకం విలువ 16 పైసలు పెరిగింది. సోమవారం ఇది రూ. 46.49గా ఉంది. ఈ మధ్యలో నవంబర్ 3న ఈ మారకం రేటు రూ. 47.42కు పడిపోయింది.
News Posted: 24 November, 2009
|