దుబాయి దిగుల్లేదు: ప్రణబ్
చండీఘర్ : దుబాయి వరల్డ్ రుణ సంక్షోభం భారత ఆర్ధిక వ్యవస్థ మీద పెద్దగా ప్రభావం చూపించబోదని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. అయినా ప్రభుత్వం పరిణామాలను చాలా నిశితంగా గమనిసోందని, ఒకవేళ ఏదైనా జరిగితే నివారించడానికి సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. 'దుబాయ్ వరల్డ్ లో మన పెట్టుబడులు చాలా తక్కువ, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన డబ్బు ప్రమేయం గణించతగింది కాద'ని ఆయన వివరించారు. ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రణబ్ మీడియాతో మాట్లాడారు. సునిశిత పరిశీలనతో అప్రమత్తంగా ఉండి సరైన సమయంలో చర్యలు తీసుకోగలిగితే కొన్ని సంక్షోభాలను నివారించుకోవచ్చని ఆయన అన్నారు.
భారతదేశం నుంచి అత్యధికంగా జరుగుతున్న ఎగుమతులకు దుబాయి కూడా భాగంగా ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండవ పెద్ద మార్కెట్ గా ఉంది. ఇక్కడి నుంచి దాదాపు 10 నుంచి 12 శాతం రాబడి వస్తోంది. తాజాగా ఏర్పడిన ఎమిరేట్స్ సమస్య వలన అక్కడ పనిచేస్తున్న భారతీయులు వెనక్కి వచ్చే అవకాశం ఉందని ప్రణబ్ అన్నారు. ఎమిరేట్స్ జనభాలో దాదాపు 40 శాతం భారతీయులే ఉన్నారు.
News Posted: 28 November, 2009
|