మళ్ళీ పసిడిపై దృష్టి
న్యూఢిల్లీ : దుబాయి దెబ్బతో దిగాలు పడిన పుత్తడి ధరలు భారత్ లో ఆశలు పెంచాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి మరో రెండు వందల టన్నుల బంగారాన్ని కొనేస్తే బావుంటుందన్న ఆలోచనలో రిజర్వ్ బ్యాంకు అధికారులు ఉన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కూడా తలదూర్చడం లేదు. ఎందుకంటే నవంబర్ 3 వ తేదీన భారత్ 200 టన్నల బంగారాన్ని కొని ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. దాని కోసం సుమారు 32 వేల కోట్ల రూపాయలను చెల్లించింది. కాకపోతే నిల్వలో ఉన్న అమెరికా కరెన్సీ నుంచి దీనికోసం 6.7 బిలియన్ల డాలర్లను మారకం చేసింది. దుబాయి సంక్షోభం తలెత్తక ముందే బంగారం ధర పైపైకి ఎగబాకి పోయింది. దాంతో భారత్ కొన్న రెండు వందల టన్నుల బంగారం ఖరీదు 40 వేల కోట్ల రూపాయలకు చేరిపోయింది. దుబాయి దిగాలుతో బంగారం కుదేలై ఉన్నందున దానిని కొనడానికి ఇదే సరైన సమయమని అంచనా వేస్తున్నారు. అయితే ఉన్న డాలరు నిల్వలను దృష్టిలో పెట్టుకుని ఎంత బంగారం కొనాలన్నది నిర్ణయిస్తారని అలానే ధరలను కూడా పరిగణనలోనికి తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు.
దుబాయి ఆర్ధిక సంక్షోభం కారణంగా పశ్చిమ దేశాలు ఆర్ధికమాంద్యం నుంచి కోలుకునే ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డాలర్ పతనం కొనసాగుతుందని, అందువల్ల డాలర్ ను ఎప్పటికీ విలువ తగ్గని రంగాలకు మరలించడానికే అవకాశం ఉందని వివరిస్తున్నారు. భారత్ కూడా ఆ ప్రక్రియలో భాగంగానే పసిడిపై పెట్టుబడులు పెడుతోందని అంటున్నారు. ఈ యేడాది బంగారం ధరలు దాదాపు 32 శాతం పెరిగాయి. వచ్చే యేడాది కూడా ఈ పెరుగుదల కొనసాగుతుందని అంచనాలు వేస్తున్నారు. ఈసారి చైనా కూడా రెండువందల టన్నల బంగారాన్ని కొనవచ్చని తెలిసింది.
News Posted: 30 November, 2009
|