నల్లపూసైన విటమిన్ - సి
న్యూఢిల్లీ : ఇక నుంచి మందుల దుకాణాల్లో విటమిన్ - సి మాత్రలు దొరకకపోవచ్చు. నోరు పూసిందంటే చాక్లెట్ లా కొనుక్కుని చప్పరించే ఈ మాత్రల ఉత్పత్తిని కంపెనీలు గణనీయంగా తగ్గించివేశాయి. యేటా సుమారు రెండు వందల కోట్ల రూపాయల విలువైన విటమిన్ సి ఔషధాలు భారత్ మార్కెట్ లో అమ్ముడవుతున్నాయి. దీని ఉత్పత్తికి అవసరమయ్యే ముడి పదార్ధాలు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. అయితే ఇటీవల చైనా ఈ ముడి పదార్ధాల ధరలను విపరీతంగా పెంచేయడంతో, భారత్ లో విటమిన్- సి ఔషధాలను ఉత్పత్తి చేసే కంపెనీలు నష్టపోతున్నాయి.
ఎందుకంటే మానవ శరీరానికి చాలా అవసరమయ్యే విటమిన్ -సి ఔషధాల ధరలను కంపెనీలు ఇష్టం వచ్చినట్లు పెంచుకోడానికి వీలు లేదు. భారాన్ని వినియోగదారునిపై తోసేయడానికి అవకాశం లేదు. దేశంలో తయారయ్యే 74 అత్యవసర ఔషధాల ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ అదుపు చేస్తోంది. ఈ జాబితాలో విటమిన్ -సి కూడా ఉండటమే దీనికి కారణం.
బీజింగ్ లో 2008 లో జరిగిన ఒలంపిక్ క్రీడల సందర్భంగా చైనాలో కాలుష్యాన్ని వెదచల్లే పరిశ్రమలను ప్రభుత్వం మూయించివేసింది. దానిలో విటమిన్ -సి ముడిపదార్ధాల పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో కాలుష్య నివారణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడటం చాలా వ్యయంతో కూడుకున్నది కావడంతో కొన్ని పరిశ్రమలు మాత్రమే ప్రస్తుతం ముడి పదార్ధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ కంపెనీలు ధరలను గణనీయంగా పెంచేశాయని విటమిన్ -సి ఔషధాల ప్రధాన ఉత్పత్తి దారు ప్రిమాల్ ఫార్మాస్యూటికల్స్ అధినేత డాక్టర్ స్వాతి ప్రిమాల్ చెప్పారు.
కాగా వాస్తవ పరిస్థితిని ధరల నియంత్రణ సంస్థకు వివరిస్తూ లేఖ రాశామని, విటమిన్ - సి ఔషధాలను పెద్దయెత్తున ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని చెప్పామని ఆంగ్లో ఫ్రెంచ్ సప్లై చైన్ అధిపతి రాజేష్ శర్మ వెల్లడించారు. కాగా ధరల విషయంలో ఇబ్బందులు తలెత్తితే తాము తప్పక పరిశీలన చేస్తామని ధరల నియంత్రణ సంస్థ చైర్మన్ హమీ ఇచ్చారు.
News Posted: 30 November, 2009
|