ముంబై : వర్తమాన సంవత్సరం (2009)లో అత్యంత ఘనమైన వాణిజ్య భవనం అమ్మకంగా భావిస్తున్న ఒక లావాదేవీలో ముంబైకి చెందిన డెవలపర్ రుస్తుంజీ సంస్థ తూర్పు అంధేరి ప్రాంతంలో లక్షా 42 వేల చదరపు అడుగుల ఆఫీసు స్థలాన్ని రూ. 211 కోట్ల భారీ మొత్తానికి ప్రభుత్వ రంగ ఎస్ బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి విక్రయించింది. రెండు పక్షాల మధ్య మంగళవారం సాయంత్రం ఈ డీల్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ భవనం వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవేపై ఉన్నది. భవనం ఇంధన శక్తి సామర్థ్యం డిజైన్ కారణంగా దీనిని 'గ్రీన్ బిల్డింగ్'గా సర్టిఫై చేశారు. 'ఈ వాణిజ్య భవనం కొనుగోలు కోసం గడచిన మూడు నాలుగు మాసాలుగా సంప్రదింపులు సాగుతున్నాయి' అని రుస్తుంజీ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలియజేశారు.