'గాంధి' పెన్ పై పిల్
న్యూఢిల్లీ : మహాత్మా గాంధి నిరాడంబరతకు ప్రతీక అని, అందువల్ల ఆయన పేరును అత్యధిక ధర నిర్ణయించిన విలాస వస్తువుల అమ్మకానికి ఉపయోగించరాదని వాదిస్తూ సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజక వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఒక్కొక్కటి రూ. 12 లక్షలు ఖరీదు చేసే తన పెన్నులపై గాంధీజీ చిత్రాన్ని ముద్రించాలన్న మాంట్ బ్లాంక్ సంస్థ నిర్ణయాన్ని ఈ పిల్ సవాల్ చేస్తున్నది. గాంధీజీ 140వ జయంతి సందర్భంగా జర్మనీ సంస్థ మాంట్ బ్లాంక్ 18 క్యారట్ల బంగారంతో తయారు చేసిన 241 పెన్నులను భారతీయ మార్కెట్ లో విడుదల చేసింది.
ఒక ఊత కర్రతో గాంధీజీ చిత్రాన్ని, ఆయన సంతకాన్ని తమ పెన్నులపై ముద్రించడం ద్వారా ఆయనను గౌరవించడమే కంపెనీ ఆంతర్యమని మాంట్ బ్లాంక్ చేసిన ప్రకటనను పిల్ తిరస్కరించింది. 'మహాత్మాను గౌరవించడానికే ఈ ప్రాజెక్టును తలపెట్టామనడం పూర్తిగా తప్పు' అని పిల్ దాఖలు చేసిన ఇద్దరు న్యాయవాదులు పేర్కొన్నారు. 'ఆయనను గౌరవించే నెపంతో కొందరు వాణిజ్య ప్రయోజనాల కోసం మహాత్మాను పోస్టర్ మనిషిగా ఉపయోగించుకుంటున్నారు' అని పిల్ లో వారిద్దరూ ఆరోపించారు.
కంపెనీ విడుదల చేసిన ఒక చిన్న పుస్తకం కాపీని కూడా పిటిషనర్లు తమ పిటిషన్ కు జత పరిచారు. 'కత్తి కన్నా కలం బలమైనది' అనే నినాదంతో పాటు గాంధీజీ ప్రవచనాలు పెక్కింటిని కంపెనీలో ఆ పుస్తకంలో పొందుపరిచింది. 'ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న వ్యక్తులు, ఈ బ్రాండ్ వాణిజ్య ప్రయోజనాల కోసం మహాత్మా పేరును ఉపయోగించుకుంటున్నందుకు ఆయనకు క్షమాపణ చెప్పవలసిందే' అని పిటిషన్ స్పష్టం చేసింది.
1950 నాటి చిహ్నాలు, పేర్లు (అక్రమ వినియోగం నివారణ) చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఏ వ్యాపారం, వాణిజ్యం లేదా వృత్తి అవసరాల కోసం గాంధీజీ చిత్రాలను ఉపయోగించజాలరని పిటిషన్ పేర్కొన్నది. మహాత్మా చిత్రాన్ని ఉపయోగించకుండా కంపెనీని నిరోధించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు పిటిషన్ విజ్ఞప్తి చేసింది. సుప్రీం కోర్టు డిసెంబర్ 7న ఈ పిటిషన్ పై విచారణ జరపవచ్చు.
News Posted: 4 December, 2009
|