బిఎస్ఎన్ఎల్ కూడా పైసా!
న్యూఢిల్లీ : టెలికామ్ చార్జీల పోరులో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) కూడా చేరింది. ఈ సంస్థ సోమవారం తన జాతీయ రోమింగ్ చార్జీలను తగ్గించి, రెండు ఆప్షన్లను సూచించింది. వాటిలో ఒకటి నిమిషానికి 49 పైసలు కాగా రెండవది సెకనుకు ఒక పైస. జాతీయ రోమింగ్ చార్జీలను 'నిమిషానికి ఒక రూపాయి లేదా రూపాయిన్నర నుంచి 49 పైసలకు' తాను తగ్గించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. రెండవ పథకం కింద రోమింగ్ చార్జీలు తన సొంత నెట్ వర్క్ పై కాల్స్ కు సెకనుకు ఒక పైస, ఇతర నెట్ వర్క్ లపై సెకనుకు 1.2 పైసలుగా ఉంటాయని కూడా తెలియజేసింది. సర్వీస్ ప్రొవైడర్ పరిధిలో లేని మొబైల్స్ కు చేసిన కాల్స్ కు వసూలు చేసే రుసుమే రోమింగ్ చార్జీలు.
'దేశంలో ప్రస్తుతం నెలకొన్న ధరల యుద్ధంలో పాల్గొనే ప్రయత్నమే ఇది' అని బిఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కులదీప్ గోయల్ పేర్కొన్నారు. 'మా నెట్ వర్క్ వల్ల ప్రయోజనాలను మా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం' అని ఆయన తెలిపారు. సెకను బిల్లింగ్ విధానానికి ఆపరేటర్లు పూనుకోవడం పరిశ్రమలో చార్జీల పోరుకు నాంది పలికింది.
News Posted: 8 December, 2009
|