న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత శీఘ్రంగా వృద్ధి చెందుతున్న మొబైల్ మార్కెట్ అయిన భారతదేశంలో తృతీయ తరం (3జి) వైర్ లెస్ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియను జనవరి 14 (సంక్రాంతి) నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఆండిముత్తు రాజా సోమవారం ప్రకటించారు. 'ముందు నిర్ణయించిన ప్రకారమే వేలం జరుగుతుంది. సమానావకాశాల కల్పనకై స్పెక్ట్రమ్ కేటాయింపులు 2010 ఆగస్టుకు పూర్తవుతాయి' అని రాజా న్యూఢిల్లీలో స్పెక్ట్రమ్ పై మంత్రిత్వశాఖ బృందం సమావేశం అనంతరం విలేఖరులతో చెప్పారు. 'నలుగురు సర్వీస్ ప్రొవైడర్లకు కేటాయింపులు ఒకేసారి జరుగుతాయి' అని మంత్రి తెలిపారు.
రానున్న వేలంపాట విజేతలందరికీ ఒకేసారి స్పెక్ట్రమ్ కేటాయింపు జరపాలని టాటా గ్రూప్ చైర్మన్ రతన టాటా ప్రభుత్వాన్ని కోరినట్లు 'ఎకనామిక్ టైమ్స్' పత్రిక తెలియజేసింది.
ఫోన్ కంపెనీలు కేవలం 3జి స్పెక్ట్రమ్ పైనే 1.5 బిలియన్ డాలర్లు వెచ్చించవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. హైస్పీడ్ వైర్ లెస్ నెట్ వర్క్ ల నిర్మాణానికి మరిన్ని డాలర్లు ఖర్చు కాగలవని వారు సూచిస్తున్నారు.