పసిడి మరింత తగ్గింది
ముంబయి : పసిడి తళుకులు వెలవెలబోతున్నాయి. డాలర్ బలపడటంతో పసిమిలోహం మొహం చిన్నబోయింది. మంగళవారం బంగారం ధర మరింత పడిపోయింది. మూడు వారాల క్రితం అత్యధికంగా పదిగ్రాముల స్వచ్ఛమైన బంగారం 18,550 రూపాయలకు చేరి ఇక ఇరవై వేలు కావడం రోజుల్లో జరిగిపోతుందనే అంచనాలు ఇచ్చింది. కానీ మరుసటి వారం నుంచే పతనం మొదలై ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉంది. ఒక్క సోమవారం నాడే సుమారు ఎనిమిది శాతం తగ్గి పదిగ్రాముల ధర 16,660 రూపాయలకు చేరింది. ఈ పతనం కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రిస్ మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో బంగారు ఆభరణాల కొనుగోలుకు చిన్న కుటుంబీకులు మొగ్గు చూపాలంటే ధరలు మరింత తగ్గకతప్పదని వారు వివరిస్తున్నారు.
కాగా అమ్మకాలు లేక రిటైల్ మార్కెట్ గగ్గోలు అవుతోంది. గత రెండు మూడు వారాలుగా ప్రతీ రోజు వందో, యాభై రూపాయలు చొప్పున ధరలు తగ్గుతున్నా చిన్న కొనుగోలు దారులు ఇంకా దుకాణాల మొహం చూడటం లేదని ఆభరణాల వ్యాపారులు చెబుతున్నారు. బంగారం ధర అమాంతం పెరిగిన తరువాత ముంబయి, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో రిటైల్ దుకాణాల అమ్మకాలు సుమారు యాభై శాతం తగ్గిపోయాయని ముంబయి బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ హుండియా చెప్పారు. ధరలు ఇంకా తగ్గాలని కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు. రెండు వారాల క్రితం బంగారం కొన్న వారంతా ఇప్పుడు చాలా బాధపడిపోతున్నారని, వారు పది గ్రాముల బంగారం పై సుమారు రెండు వేల రూపాయలు నష్టపోయినట్లు భావిస్తున్నారని ఆయన చెప్పారు.
గతంలో బంగారం ధర పెరిగిపోతూ ఉన్నప్పుడు జనం మరింత పెరిగిపోతుందనే ఆందోళనతో ఎగబడి కొన్నారని, దానికి తోడు పెళ్ళిళ్ల సీజన్ కావడంతో ధరలు ఎంతైనా ఎగరేసుకుపోయారని ఎన్ఐబిఆర్ బులియన్ సంస్థ ఎండి హర్మేష్ అరోరా చెప్పారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, అంతర్జాతీయంగా బంగారం ధరలు పడిపోవడం, సమీపంలో పెద్ద పండగలేవీ లేకపోవడం, ధరల పతనంతో కొనుగోలుదారులు వేచి చూడటంతో రిటైల్ మార్కెట్ అమ్మకాలు బాగా పడిపోయాయని ఆయన పేర్కొన్నారు.
News Posted: 22 December, 2009
|