పెట్రోల్ కంట్రోల్ తప్పవచ్చు
న్యూఢిల్లీ : ఇంధల ధరలపై ప్రభుత్వ నియంత్రణను తప్పించే అంశంపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల ఆర్థిక ఆరోగ్యంపై సమీక్ష నిమిత్తం జనవరి 13న నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ఆయిల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ లు ఆ రోజు సమావేశంలో పాల్గొనగలరని భావిస్తున్నారు.
ఆయిల్ కంపెనీల నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 45 వేల కోట్ల మేరకు ఉండవచ్చు. క్రితం సంవత్సరం పిఎస్ యుల నష్టాలు రూ. 1.06,000 కోట్ల మేర ఉన్నాయి. ఆయిల్ సంస్థల నిర్వహణ, ధరల వ్యవస్థ, సబ్సిడీ వ్యవస్థ గురించి పెట్రోలియం మంత్రిత్వశాఖ ఒక నివేదిక సమర్పించవచ్చు. మార్కెట్ ధరల కన్నా తక్కువకు ఇంధనాన్ని విక్రయిస్తున్నందుకు పిఎస్ యుల నష్టపరిహారం చెల్లించేందుకు ఒక యంత్రాంగాన్ని రూపొందించడం గురించి కూడా ఆ రోజు సమావేశంలో చర్చించనున్నారు.
కిరోసిన్, ఎల్ పిజిలపై రెవెన్యూ నష్టాలను భరించాలని ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రథమార్ధంలో నిర్ణయించింది. పెట్రోల్, డీజెల్ అమ్మకాలపై నష్టాన్ని ఒఎన్ జిసి, గెయిల్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఆయిల్) సంస్థలు భరించగలవని కూడా ప్రభుత్వం తెలియజేసింది. అయితే, ఆర్థిక మంత్రిత్వశాఖ పిఎస్ యు ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు ఎటువంటి బాండ్ నూ ఇంకా ఇవ్వలేదు. ఈ సంస్థలకు బాండ్లకు బదులు నగదును ప్రభుత్వం అందజేయగలదని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ చావ్లా మంగళవారం తెలియజేశారు. బాండ్లను నగదుగా వెంటనే మార్చుకోవడం కష్టం కనుక నగదు స్వీకరణకే ఆయిల్ కంపెనీలు కూడా సుముఖత వ్యక్తం చేశాయి.
News Posted: 24 December, 2009
|