టెలిఫోన్ బూత్ లో బ్యాంక్
న్యూఢిల్లీ : ఏదైనా బ్యాంకులో కొత్తగా అకౌంట్ తెరవడానికి పబ్లిక్ టెలిఫోన్ బూత్ (పిసిఒ)కు వెళితే చాలు. అక్కడి ఆపరేటర్లే బ్యాంకు తరఫు ప్రతినిధిగా మీకు ఎకౌంట్ తెరుస్తారు. బ్యాంకులకు బిజినెస్ కరెస్పాండెంట్ లుగా పిసిఒ ఆపరేటర్లను అనుమతించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) ప్రకటించిన దాదాపు ఒక నెల తరువాత ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ), టెలికామ్ కంపెనీలు పిసిఒల ద్వారా ఆర్థిక లావాదేవీలు పెంచే విషయమై పరస్పరం లబ్ధి పొందగల విధానాన్ని రూపొందించేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ ప్రక్రియ కోసం 14 బ్యాంకుల అధికారులు బుధవారం టెలికామ్ సంస్థల అధికారులతో ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఎఐ) చైర్మన్ నందన్ నీలేకని అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్ తో సహా ప్రముఖ బ్యాంకుల ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు.
బ్యాంకులు, టెలికామ్ కంపెనీల ప్రతినిధులతో రెండు సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వీటిలో ఒక సబ్ కమిటీ రెండు రంగాల మధ్య నియంత్రణతో సహా వాణిజ్యపరమైన అంశాలను పరిశీలిస్తుంది. మరొక సబ్ కమిటీ ప్రామాణీకరణ, నిర్వహణతో సహా సాంకేతిక అంశాలను పరిశీలిస్తుంది. '2000 పైచిలుకు జనాభా గల ప్రతి గ్రామంలో బిజినెస్ కరెస్పాండెంట్లను కలిగి ఉండాలని మేము ఆకాంక్షిస్తున్నాం. బ్యాంకులకు బిజినెస్ కరెస్పాండెంట్ గా వ్యవహరించేందుకు పిసిఒ ఆపరేటర్లను ఉపయోగించుకునేందుకు ఆర్ బిఐ అనుమతించినందున రెండు రంగాలు పరస్పరం ఏవిధంగా సహకరించుకోవచ్చో పరిశీలిస్తున్నాం. ఇది ఉభయతారకం. బ్యాంకులకు ఆర్థికంగా లాయకీ అయిన, టెలికామ్ కంపెనీలకూ కొన్ని ప్రోత్సాహకాలు లభించగల విధానాన్ని రూపొందిస్తున్నాం' అని ఐబిఐ చైర్మన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.వి. నాయర్ తెలియజేశారు.
రెండు సబ్ కమిటీలు రెండు నెలలలోగా తమ నివేదికలు సమర్పిస్తాయి. బ్యాంక్ అకౌంట్ తెరిచేందుకు ఒక డాక్యుమెంట్ గా యుఐడిని అనుమతించవలసిందిగా ఆర్ బిఐని కోరాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. 'అన్ని వర్గాల వారికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం అవసరం. ఈ లక్ష్య సాధనకు యుఐడి దోహదం చేస్తుంది. బ్యాంకు అకౌంట్ తెరిచేందుకు ఒక అంగీకృత పత్రంగా యుఐడిని అనుమతించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. టెలికామ్ సంస్థల కెవైసి (నో యువర్ కస్టమర్ = మీ కస్టమర్ గురించి తెలుసుకోండి) నిబంధనలను కూడా పాటించేందుకు యుఐడి ఉపయుక్తంగా ఉంటుందని మా నమ్మకం' అని నీలేకని పేర్కొన్నారు. కెవైసి నిరూపణ పత్రంగా యుఐడిని అనుమతించాలనే అభ్యర్థనను ఆర్ బిఐ ఆమోదించేటట్లయితే, బ్యాంక్ అకౌంట్ తెరిచేందుకు గుర్తింపు ప్రూఫ్ ను చూపించే సమస్య పరిష్కారం కాగలదు.
News Posted: 7 January, 2010
|