ఖాళీగా 'ఐటి' స్థలం
హైదరాబాద్ : హైదరాబాద్ లో ఐటి మౌలికవసతుల కల్పన కోసం కేటాయించిన స్థలంలో సుమారు 28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఖాళీగా ఉండిపోయింది. ఐటి, ఐటి ఎనేబుల్డ్ సర్వీసుల కోసం ఉద్దేశించిన 48 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంలో 20 లక్షల చదరపు అడుగుల ప్రాంతం మాత్రమే గడచిన రెండేళ్లలో నిండింది. మిన్నంటుతున్న అద్దెలు, ఐటి కార్యకలాపాలలో మాంద్యం ఇందుకు కారణాలుగా పేర్కొంటున్నారు.
అద్దెలు విపరీతంగా పెరిగిపోవడానికి ఐటి సంస్థలు తమను తాము నిందించుకుంటున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం ప్రముఖ ప్రదేశాలలో స్థలం కోసం అవి అసాధారణ రేట్లు చెల్లించాయి. ఇప్పుడు రెవెన్యూ, లాభాలు తగ్గుముఖం పట్టడంతో అవి ఖర్చులు తగ్గించుకునేందుకు కొత్త ప్రదేశాలకు మారుతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, వరంగల నగరాలలో పరిస్థితి కూడా ఇదే విధంగా ఉన్నది. 'లాభాలు తగ్గిపోవడంతో చిన్న తరహా, మధ్య తరహా ఐటి సంస్థలకు అద్దెలు అందుబాటులో లేకుండా పోయాయి' అని సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్ టిపిఐ) హైదరాబాద్ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ చెప్పారు.
సన్నకారు, మధ్య శ్రేణి ఐటి సంస్థలు విపరీతమైన అద్దెల భారాన్ని భరించలేక తక్కువ అద్దెలు ఉండే ప్రదేశాలకు మారవలసి వస్తున్నది. ఐటి మౌలిక వసతుల కల్పన సంస్థలకు ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణపై లేదా కొత్తవి చేపట్టడంపై అవి పునరాలోచనలో పడ్డాయి. 'మూడు సంవత్సరాల క్రితం ఐటి మౌలిక వసతులకు కొరత ఉన్నది. ఇప్పుడు మిగులు సమస్య ఏర్పడింది' అని హైదరాబాద్ ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటిఇఎస్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం. నరసింహారావు చెప్పారు.
డిమాండ్ ఒక్కసారిగా పడిపోవడంతో హైదరాబాద్ నగరంలోను, పరిసర ప్రాంతాలలోను ప్రతిపాదిత ఐటి ఎస్ఇజడ్ లు నిలచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 20 ఐటి ఎస్ఇజడ్ లలో రెండు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయి. మిగిలినవి పనులను ఆపివేశాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేనందున తమ ఎస్ఇజడ్ ను డీ నోటిఫై చేయవలసిందిగా మేటాస్ ప్రాపర్టీస్, మేటాస్ ఎంటర్ ప్రైజెస్ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇక సత్యం సంస్థ విశాఖలో ఎస్ఇజడ్ ను ఏర్పాటు చేయాలని అనుకున్నది. కాని అది ముందుకు సాగలేదు. ఐటి ఎస్ఇజడ్ లలో చాలా వరకు ప్రభుత్వం తమకు ఇచ్చిన భూములలో ప్రహరీ గోడలను మాత్రమే కట్టాయి. మార్కెట్ పరిస్థితుల మెరుగుదల కోసం అవి చకోర పక్షుల్లా ఎదురుతెన్నులు చూస్తున్నాయి.
News Posted: 11 January, 2010
|