చిన్న కార్లలో చిన్నది
న్యూఢిల్లీ : బజాజ్ ఆటో సంస్థ రూపొందిస్తున్న, ఇండియాలో రెనాల్ట్ - నిస్సాన్ సంయుక్తంగా మార్కెట్ చేసే చిన్న కారు మారుతి సుజుకి ఆల్టో కన్నా చిన్నదిగా ఉంటుందని ఫ్రెంచ్ కారు సంస్థ రెనాల్ట్ తెలియజేసింది. 'మేము బజాజ్ తో చర్చలు జరుపుతున్న కారు ఒక చిన్న కారు కన్నా కూడా చిన్నదిగా ఉంటుంది. మారుతి సుజుకి ఆల్టో వంటి చిన్న కారును లేదా 1.2 లీటర్ల కారును రెనాల్ట్ బజాజ్ తమ చర్చలకు ప్రాతిపదిక చేసుకోలేదు. చిన్న కారు కన్నా కూడా చిన్నదైన కారు గురించి మేము చర్చిస్తున్నాం' అని రెనాల్ట్ ఆసియా ఆఫ్రికా మేనేజ్ మెంట్ కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కట్సుమి నకామురా వివరించారు.
తక్కువ ఖరీదైన ఒక కారు తయారీ ప్రాజెక్టును రెనాల్ట్ - నిస్సాన్ సంయుక్త సంస్థ బజాజ్ ఆటోతో కలసి ఖరారు చేసినట్లు రెనాల్ట్ చైర్మన్, సిఇఒ కార్లోస్ ఘోసన్ క్రితం సంవత్సరం ప్రకటించారు. తొలుత సంకల్పించిన గడువు కన్నా ఒక సంవత్సరంర ఆలస్యంగా 2012 నాటికి ఈ కారును మార్కెట్ లోకి ప్రవేశపెట్టనున్నారు.
కారు డిజైన్, ఇంజనీరింగ్, సోర్సింగ్, తయారీ బాధ్యతలను బజాజ్ ఆటో నిర్వర్తిస్తుందని, మార్కెటింగ్, అమ్మకం లావాదేవీలను రెనాల్ట్ - నిస్సాన్ సంయుక్త సంస్థ నిర్వహిస్తుందని ఘోసన్ తెలిపారు. మరొక ముఖ్య విషయమేమంటే ఈ కారుపై బజాజ్ బ్రాండ్ ఏమీ ఉండదు. తన ద్విచక్ర, త్రిచక్ర వాహనాలలోని విడిభాగాలలో 70 శాతం నుంచి 80 శాతం వరకు ఈ చిన్న కారులో ఉండగలవని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఆతరువాత తెలియజేశారు. ఈ చిన్న కారును 2011కల్లా మార్కెట్ లోకి తీసుకురావాలని తొలుత సంకల్పించారు. కాని ధర, డిజైన్ విషయమై భాగస్వాముల మధ్య భేదాభిప్రాయాల కారణంగా ఒక సంవత్సరం ఆలస్యమైంది.
News Posted: 15 January, 2010
|