పూల సంపాదన 65 కోట్లు
న్యూఢిల్లీ : దేశం నుంచి పూల ఎగుమతులు 2008 - 09 సంవత్సరంలో ఏప్రిల్, ఫిబ్రవరి మధ్య 65.63 కోట్ల రూపాయలకు పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ ఎగుమతుల విలువ 48.75 కోట్ల రూపాయలు మాత్రమే. అలకరణకు ఉపయోగించే కార్నేషన్లు, గ్లాడియోలస్ వంటి పూలపై దేశం దృష్టి సారించడం ఈ ఎగుమతుల పెరుగుదలకు కారణం. పూల ఎగుమతులు ఎక్కువగా అమెరికా, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్ డమ్ (యుకె), జపాన్ దేశాలకు జరిగాయి. 'దేశంలో పూల పరిశ్రమ ఎగుమతుల లక్ష్యంతో సాంప్రదాయక పూల నుంచి ఆలంకారిక పూలపై దృష్టి నిలుపుతున్నది' అని అధికారి ఒకరు తెలియజేశారు.
నియంత్రిత వాతావరణ పరిస్థితుల కింద ఎగుమతి ప్రాధాన్యం గల పూల తోటల పెంపకానికి ఔత్సాహిక వాణిజ్యవేత్తలు ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేస్తున్నారని వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహారోత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎపెడా) అధికారి ఒకరు తెలిపారు. 2007 - 08 సంవత్సరంలో పూల తోటల విస్తీర్ణం 160.7 వేల హెక్టార్లని అంచనా. వీటిలో బంతిపూలు, మల్లె, గులాబి, ఏస్టర్, ట్యూబరోజ్, ఆంథూరియం పూలు కూడా ఉన్నాయి. 300 పూల ఉత్పత్తి సంస్థలలో 50 శాతం పైగా ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్ లలో విస్తృత ప్రాంతాలలో పూల మొక్కలు పెంచుతున్నారు. 'అవసరైన సాంకేతిక సౌకర్యాలు, ఆర్థిక సహాయం సమకూరుస్తూ ప్రభుత్వం ఎపెడా, ఎగుమతి తనిఖీ మండలి (ఇఐసి) వంటి ఎగుమతి ప్రోత్సాహక సంస్థలతో సమన్వయీకృత కృషి జరుపుతున్నది' అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.
News Posted: 15 January, 2010
|