'పెట్రోల్ సబ్సిడీ తీసేయండి'
న్యూఢిల్లీ : పెట్రోల్ రీటైల్ అమ్మకాలలో పూర్తిగా మార్కెట్ ధరలతో సామ్యం ఉండాలని, డీజెల్, ఎల్ పిజి, కిరోసిన్ వినియోగదారులు పాక్షికంగా ధరల భారం భరించాలని చమురు, సహజ వాయువుల కమిషన్ (ఒఎన్ జిసి) సూచించింది. బ్యారెల్ కు 60 డాలర్లను మించి క్రూడాయిల్ ధరలలో పెరుగుదలలో భారాన్ని పంచుకునేందుకు ఒక సూత్రాన్ని కూడా కమిషన్ ప్రతిపాదించింది.
క్రూడాయిల్ ఉత్పత్తి సంస్థగా ఒఎన్ జిసి క్రూడాయిల్ ధరలలో పెరుగుదల వల్ల లాభం పొందవలసి ఉంది. కాని వంట, మోటార్ వాహనాల ఇంధనాల అమ్మకంపై సబ్సిడీలో కొంత భారాన్ని భరించవలసి రావడంతో కమిషన్ కు పూర్తిగా లాభం చేకూరడం లేదు. వర్తమాన క్రూడాయిల్ ధరల ప్రాతిపదికపై సబ్సిడీ వ్యవస్థను సరిదిద్దాలని తమ సంస్థ ఆయిల్ ధరలకు సంబంధించిన కీర్తి పారిఖ్ కమిటీకి అందజేసిన నివేదికలో సూచించినట్లు ఒఎన్ జిసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.ఎస్. శర్మ 'బిజినెస్ స్టాండర్డ్' పత్రిక విలేఖరికి తెలియజేశారు. పారిఖ్ కమిటీ తన నివేదికను త్వరలో సమర్పించవచ్చునని భావిస్తున్నారు.
పెట్రోల్ ధరలపై సబ్సిడీ ఇవ్వవలసిన అవసరం లేదని శర్మ స్పష్టం చేస్తూ, 'బ్యారెల్ కు 60 డాలర్ల ధర నుంచి ధరల కొలబద్దను రూపొందించడం అవసరమని మేము సూచించాం. ఈ స్థాయిలలో అంతర్జాతీయ ధరలతో ముడిపెట్టుతూ వినిమయ ఉత్పత్తుల ధరల నిర్ణయం ఏవిధంగా ఉండాలి? ఏ ఉత్పత్తికి ఎంత మేరకు సబ్సిడీ ఇవ్వాలో ప్రభుత్వం విజ్ఞతతో నిర్ణయించాలి' అని అన్నారు.
ఉదాహరణకు, డీజెల్ లో పెరిగిన ధరలో సగాన్ని వినియోగదారులు భరించవచ్చునని, మిగిలిన మొత్తాన్ని ఈ వ్యవస్థ భరించవలసి ఉంటుందని ఆయన సూచించారు. అదేవిధంగా ఎల్ పిజి ధర పెరుగుదలలో కనీసం 20 శాతాన్ని వినియోగదారుడు, తక్కిన భాగాన్ని ప్రభుత్వం భరించాలని ఆయన అన్నారు. 'కిరోసిన్ అంశం సున్నితమైనది కనుక ప్రభుత్వం లేదా వ్యవస్థ దాని ధర పెరుగుదలలో 90 శాతం భరించవచ్చు. పెరుగుదల భారంలో కనీసం10 శాతాన్ని బదలాయించాలి. ఆవిధంగా ప్రతి ఒక్కరికీ బాధ తెలిసి వస్తుంది' అని శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ అంకెలు మారవచ్చునని ఆయన అన్నారు.
News Posted: 16 January, 2010
|