డిష్ కంపెనీలకు షాక్
న్యూఢిల్లీ : టెలివిజన్ వినియోగదారులను మోసం చేస్తూ అడ్డుగోలుగా దోచుకుంటున్న ప్రైవేటు డీటీహెచ్ (డైరక్ట్ టు హోం) కంపెనీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. టాటా స్కై, బిగ్ టీవీ, డిష్ టీవీ కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించాయంటూ కాంపిటీషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (సిసిఐ) వాటికి తాఖీదులు పంపింది. దేశంలోని వ్యాపారంలోని పోటీ వ్యవహారాలను సిసిఐ నియంత్రిస్తూ ఉంటుంది. డీటీహెచ్ కంపెనీల నుండి ఈ నోటీసులకు సమాధానం అందగానే వాటిపై భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని సీసీఐ యోచిస్తోంది.
టీవీ ఛానళ్ల ప్రసార రంగంలో కేబుల్ టీవీల స్థానే డీటీహెచ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ రంగంలోకి పలు కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించాయి. ఈ డీటీహెచ్ సర్వీసుల సంస్థలు సెట్ టాప్ బాక్స్ లు ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారులకు టీవీ ఛానళ్ల ప్రసారం చేస్తున్నాయి. అయితే ఈ సెట్ టాప్ బాక్స్ ల ద్వారా ప్రసారాలకు సంబంధించి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని నియమ నిబంధనలను రూపొందించింది. డీటీహెచ్ సర్వీసు కనెక్షన్ తీసుకున్న వినియోగదారుడు ఎప్పుడైనా ఆపరేటర్ ను మార్చుకునేందుకు వీలుగా సెట్ టాప్ బాక్స్( ఎస్టీపీ) లను రూపోందించాల్సి ఉంది. ఆలాగే ఆ సెట్ టాప్ బాక్స్ ల నుండి రెండో ఆపరేటర్ సర్వీసును కూడా పొందేందుకు అనువుగా ఎస్టీబీలను తయారు చేయాలి. అయితే బిగ్ టీవీ, టాటా స్కై, డిష్ టీవీ సంస్థలను ఈ నిబంధనను పూర్తిగా ఉల్లంఘించి వినియెగదారుడు వేరే ఇతర ఆపరేటర్ ను మార్చుకునే సౌలభ్యం లేకుండా బాక్స్ లు రూపోందించడాన్ని సీసీఐ గుర్తించింది. అంతేగాక ఆపరేటర్ ను మార్చుకునేందుకు ఈ సంస్ధలు నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు కూడా సీసీఐ దృష్టికి వచ్చింది. వినియోగదారుల ఫోరమ్ కూడా ఆపరేటర్ల చేస్తున్న ఈ మోసాలపై సీసీఐ కి ఫిర్యాదు చేసింది.
దీంతో సీసీఐ పరిశోధక విభాగ డైరక్టర్ జనరల్ రంగంలోకి దిగి విచారణ సాగించారు. ఆయన దర్యాప్తులో ఆపరేటర్లు సీసీఐ నియమావళి ప్రకారం సెక్షన్ 4,5లను ఉల్లంఘించినట్లు రుజువయింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు సీసీఐ డీజీ బిగ్ టీవీ, టాటా స్కై, డిష్ టీవీలకు తాఖీదులు పంపారు. ఈ నోటీసులకు 15 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆయా కంపెనీలకు పంపిన ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే ఈ డీటీహెచ్ కంపెనీలు తమ వార్షిక టర్నోవర్ లో10 శాతాన్ని సీసీఐ నియమావళి ఉల్లంఘించినందుకు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని సీసీఐ డీజీ చెప్పారు. తాము పంపిన తాఖీదులకు ఆ కంపెనీలు వివరణ ఇచ్చిన వెంటనే తాము జరిమానా విధించి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
News Posted: 18 January, 2010
|