కారుకు పన్ను పోటు
హైదరాబాద్ : వాహనాలను కొత్తగా కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం పన్నుల వాత పెడతోంది. తీవ్రమైన ఆర్ధిక మాంద్యం కారణంగా సంక్షేమ పథకాల అమలుపై ఊపిరి సలుపుకోలేకపోతున్న ప్రభుత్వం కార్లుకు జీవిత పన్ను పెంచగా, జేసీబీలు, డంపర్లను కూడా తాజాగా పన్నుల పరిధిలోకి తెచ్చింది.ఈ పన్నులను పెంచడం ద్వారా ఏటా 110 కోట్ల రూపాయల ఆదాయాన్ని అదనంగా సమకూర్చుకోవాలని యోచిస్తోంది. అయితై ఈ పన్నుల భారం నుండి ద్విచక్ర వాహనదారులకు మాత్రం మినహాయించి కరుణ చూపింది.వాహనాల జీవిత పన్ను పెంపుపై మరో వారం రోజుల్లో ఆర్డినెన్స్ జారీ కానున్నాయి. ఇవి వెలువడిన వెంటనే నిర్ణయం అమల్లోకి రానుంది.
అన్ని రకాల వాహనాలపైనా పన్నుల పెంపును ప్రతిపాదిస్తూ రెండు నెలల కిందట రవాణా శాఖ ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపింది. లారీలు, బస్సులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఇలా అన్నింటిపైనా జీవిత పన్ను పెంచాలని ఆ ప్రతిపాదనల్లో సూచించింది. ఒకేసారి పెంచితే తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని ఊహించిన ప్రభుత్వం ముఖ్యమైన వాహనాలపైనే పెంచాలని నిర్ణయించింది. అయితే కార్లను సొంత అవసరాల కోసం కొనుగోలు చేసేవారు ఇప్పటి వరకు 9 శాతం జీవితపన్ను చెల్లిస్తుండగా, వారిని రెండు కేటగిరీలుగా విభజించింది. కారు విలువ 10 లక్షల రూపాయల లోపు అయితే 12 శాతం చెల్లించాల్సి ఉంటుంది. 10 లక్షల రూపాయలు దాటితే 14 శాతం చెల్లించాలని తాజా పెంపుదలలో పేర్కొన్నారు. మోటారు క్యాబ్స్ కూడా పన్నును 14 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రెండో వాహనం కలిగి ఉన్నవారు, కంపెనీలు వాహనం కొనుగోలు చేసినా పన్నును 12 శాతం నుండి 14 శాతానికి పెంచారు. అలాగే రోడ్ రోలర్లపై 7 శాతం పన్ను వసూలు చేస్తుండగా, జేసీబీలు, డంపర్లు, గ్రేడర్లు వంటి యంత్రాలను కూడా పన్ను పరిధిలోకి తెచ్చారు. ఆటోలు, బస్సులు, టూరిస్ట బస్సులపైనా పన్ను పెంచాలని రవాణా శాఖ యోచించినా ప్రభుత్వం అంగీకరించలేదు.
News Posted: 18 January, 2010
|