'బికారి'గా సత్యం రాజు
న్యూయార్క్ : 100 కోట్ల డాలర్ల మేరకు తన సంస్థ ఆస్తులను అతిగా చూపినట్లు నిరుడు అంగీకరించిన సత్యం కంప్యూటర్స్ సంస్థ మాజీ చైర్మన్ బి. రామలింగరాజును న్యూయార్క్ లో ఒక న్యాయస్థానం బికారిగా ప్రకటించింది. దీని వల్ల రామలింగరాజుకు కోర్టు ఖర్చులు చెల్లించకుండా మినహాయింపు లభిస్తుంది.
రామలింగరాజు, ఆయన సోదరుడు సత్యం సంస్థ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) రామరాజు, సంస్థ ఆర్థిక విభాగం మాజీ అధిపతి శ్రీనివాస్ వడ్లమానిలకు 'బికారి' ప్రతిపత్తి మంజూరుకు న్యూయార్క్ జడ్జి బార్బరా ఎస్. జోన్స్ అంగీరించారు. తమను 'బికారులుగా' ప్రకటించాలని, ఒక న్యాయవాదిని నియమించాలని అభ్యర్థిస్తూ ప్రతివాదులు 2009 అక్టోబర్ లోల ఒక పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు పత్రాల ప్రకారం, తాము 'ఈ దావాలో మా కోసం యుఎస్ లో ఒక న్యాయవాదిని నియమించుకోలేకపోతున్నాం. ఈ కోర్టు నిర్దేశించే ఎటువంటి కోర్టు ఫీజులను చెల్లించలేని లేదా ఆర్థిక బాధ్యతలను నిర్వర్తించలేని స్థితిలో ఉన్నాం' అని నిందితులు తెలియజేశారు. 'ఫెడరల్ లాలో పేర్కొన్న ప్రకారం తాము ఖర్చులు చెల్లించలేని స్థితిలో ఉన్నట్లు ప్రతివాదులు తగు విధంగా నిరూపించారని కోర్టు భావిస్తున్నది' అని యుఎస్ జిల్లా జడ్జి జోన్స్ పేర్కొన్నారు. అయితే, ప్రత్యేక న్యాయవాదిని నియమించాలన్న వారి అభ్యర్థనను జడ్జి నిరాకరించారు. 'ప్రతివాదులు ఒక విదేశంలో జైలులో ఉన్నారు. వారిని కలుసుకోవడానికి , ఇతర విధంగా వారికి ప్రాతినిధ్యం వహించడానికి నియమిత న్యాయవాదికి కష్టం కాగలదు' అని జడ్జి ఇందుకు కారణంగా పేర్కొన్నారు.
News Posted: 28 January, 2010
|