దేశానికే కూర'గాయాలు'
న్యూఢిల్లీ : కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టిన ఆహార ద్రవ్యోల్బణం తిరిగి ఊర్థ్వ ముఖం పట్టింది. జనవరి 16తో ముగిసిన వారంలో ఇది 17.40 శాతానికి పెరిగింది. అంతకు ముందు వారంలో ఇది 16.81 శాతంగా ఉన్నది. కోడిగుడ్లు, కూరగాయలకు అధిక ధరలు పలకడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం.
పరపతి విధానం మూడవ త్రైమాసిక సమీక్ష ఫలితాలు వెలువడడానికి ఒక రోజు ముందు ప్రాథమిక ఆహార వస్తువులు, ఇంధనాల టోకు ధరలకు సంబంధించిన అధికారిక డేటా అధిక ఆహార ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం లభించబోతున్నదన్న ఆశలను హరించింది. ఆహార ద్రవ్యోల్బణం పదేళ్లలో రికార్డు స్థాయికి గత డిసెంబర్ లో 20 శాతం దరిదాపులకు చేరుకున్న సంగతి విదితమే. ఈ ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా సరఫరాకు సంబంధించిన సమస్యే అయినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ మితిమీరిన ద్రవ్య సరఫరాను, తద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి కీలకమైన పాలిసీ రేట్లు కొన్నిటిని పెంచవచ్చు.
రూ. 20 వేల కోట్లకు పైగా ద్రవ్య సరఫరాను నియంత్రిస్తూ ఆర్ బిఐ క్యాష్ రిజర్వ్ రేషియో (సిఆర్ఆర్)ను కనీసం 50 బేసిస్ పాయింట్ల మేర పెంచగలదని విశ్లేషకులు ఊహిస్తున్నారు. (బ్యాంకులు ఆర్ బిఐ వద్ద నిల్వ ఉంచవలసిన డిపాజిట్ల మొత్తం ఈ సిఆర్ఆర్.) అదే సమయంలో రెపో, రివర్స్ రెపో రేట్లను కూడా దాదాపు 25 బేసిస్ పాయింట్ల మేరకు ఆర్ బిఐ పెంచవచ్చు. అధిక ఆహార ద్రవ్యోల్బణం క్రమంగా ఉత్పత్తి, తదితర రంగాలలోకి చొచ్చుకుపోయి, మొత్తం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసే అవకాశాలు ఉన్నందున ఇటువంటి చర్య తప్పనిసరి అని భావిస్తున్నారు.
News Posted: 29 January, 2010
|