3జి వేలం వాయిదా
న్యూఢిల్లీ: కేంద్ర ఖజానాకు 35 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే 3జి టెలిఫోనీ స్పెక్ట్రమ్ వేలాన్ని వచ్చే ఆర్ధిక సంవత్సరానికి వాయిదా వేసినట్లు టెలికాం విభాగం సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చిన తరువాతే వేలం నిర్వహించవలసిందిగా సాధికార మంత్రి బృందం సభ్యుడు వీరప్పమొయిలీ స్పష్టం చేశారని, కాగా రక్షణ శాఖ స్పెక్ట్రమ్ ను ఈ యేడాది మధ్యలో మాత్రమే వదలడానికి ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. కాబట్టి ఈ యేడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వేలం జరగవచ్చని, గతంలో టెలికాం మంత్రి ఎ రాజా చెప్పినట్లు ఫిబ్రవరిలో జరగకపోవచ్చని ఆయన తెలిపారు. కాగా దీనిపై వ్యాఖ్యానించడానికి మంత్రి రాజా అందుబాటులో లేరు.
మొబైల్ ఫోను రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే 3జి సర్వీసులను అందించడానకి నాలుగు ప్రైవేట్ ఆపరేటర్లకు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నాయకత్వంలో ఉన్న కేంద్ర సాధికారిక మంత్రి బృందం ఆమోదం తెలిపింది. రేడియో తరంగాల వేలం ద్వారా ఖజానాకు 35 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. కాని ఇప్పుడు వేలానికి రేడియో తరంగాలు అందుబాటులోకి రాలేదు. అవి రక్షణ శాఖ ఆధీనంలో ఉన్నాయి. వీటిని సంవత్సరం మధ్యలో వదులుతామని ఆ శాఖ చెబుతుంది. రేడియో తరంగాలను రక్షణ శాఖ వదిలిన తరువాతే వేలం వేయాలని నిర్ణయించడంతో మొబైల్ 3జి సర్వీసులకు బ్రేక్ పడటమే కాకుండా ఖజానా కూడా ఇక్కట్లకు గురికావల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ ఎల్ మాత్రమే దేశవ్యాప్తంగా 3జి సేవలు అందిస్తోంది. ఎంఎన్ టిఎల్ న్యూఢిల్లీ, ముంబయి నగరాల్లో 3జి సర్వీసులు ఇస్తోంది.
News Posted: 29 January, 2010
|