ఉద్యోగాలిస్తున్న 'సత్యం'
న్యూఢిల్లీ : కుంభకోణంతో కళంకితమైన సత్యం కంప్యూటర్ సర్వీసెస్ సంస్థకు తిరిగి మంచి రోజులు వస్తున్నట్లున్నాయి. ఈ సంస్థ ఇప్పుడు మహీంద్రా సత్యంగా పేరు మారిన విషయం విదితమే. మౌలిక వసతులు, ఉత్పత్తి రంగాలలో ఇటీవల మంచి లాభాలు ఆర్జించిన ఈ సంస్థ తిరిగి ఉద్యోగుల నియామకాన్ని చేపట్టడమే కాకుండా రెండు వేల మంది 'వర్చువల్ పూల్' ఉద్యోగులను తిరిగి పిలిపించినట్లు తెలుస్తున్నది.
ఆన్ లైన్ సమాచారం ప్రకారం, ఈ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 200 మంది వరకు కొత్త గ్రాడ్యుయేట్లను, 200 మంది ఇతర ఉద్యోగులను నియమించవచ్చు. వర్చువల్ పూల్ లోని 2000 మంది ఉద్యోగులను ఈ సంస్థ తిరిగి చేర్చుకోవచ్చు. ఈ సంస్థ 2009 జూన్ లో సుమారు పది వేల మంది ఉద్యోగుల కోసం 'వర్చువల్ పూల్ ప్రోగ్రామ్' (విపిపి)ని ప్రకటించింది. ప్రతిభావంతులైన 'మిగులు' ఉద్యోగులను నాలుగు నెలల నుంచి ఆరు నెలల కాలానికి తక్కువ వేతనంతోనైనా అట్టిపెట్టుకోవడానికి విపిపి వల్ల వీలు కలుగుతుంది. సంస్థ ఈ గడువును 2010 మార్చి వరకు పొడిగించినట్లు తెలుస్తున్నది.
మహీంద్రా సత్యం ఉద్యోగుల సంఖ్య 2008 సెప్టెంబర్ నుంచి 43 శాతం మేర తగ్గిపోయింది. ఈ సంస్థ జనవరి నుంచి జీతాలను హెచ్చించినట్లు, బోనస్ చెల్లిస్తున్నట్లు కూడా తెలుస్తున్నది. హైదరాబాద్ కు చెందిన, తన అకౌంట్ల పునరుద్ధరణ ప్రక్రియలో ఉన్న ఈ ఐటి సేవల సంస్థ తన వార్షిక మదింపులను డిసెంబర్ లో పూర్తి చేసింది. ఎస్, టి బ్యాండ్ లలో సిబ్బందికి జీతాలు పెరిగాయి. ఈ బ్యాండ్ లలో బిఐ, ఐ వంటి ఇతర ఉన్నత స్థాయిలలోని ఉద్యోగులకు అనుబంధంగా స్టాక్ ఆప్షన్ ప్లాన్లను, పదోన్నతులను కూడా సంస్థ ఆఫర్ చేసింది. ఎస్ బ్యాండ్ ఉద్యోగులకు పని తీరును బట్టి 5 శాతం, 20 శాతం మధ్య ఇంక్రిమెంట్లను ఇవ్వగా టి బ్యాండ్ ఉద్యోగులకు ఒక్కసారిగా 6 శాతం నుంచి 7 శాతం వరకు జీతం పెంచారు. ఎస్ బ్యాండ్ ఉద్యోగులు జూనియర్ స్థాయికి చెందినవారు కాగా టి బ్యాండ్ ఉద్యోగులు రెండేళ్లకు పైగా అనుభవం ఉన్నవారు.
News Posted: 3 February, 2010
|