ఓఎన్ జీసీకీ భారీ ప్రాజెక్టు
న్యూఢిల్లీ : భారతదేశ ప్రతిష్టాత్మక సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ(ఓఎన్ జీసీ) వెనుజులా దేశానికి చెందిన అతి పెద్ద ప్రాజెక్టును చేజిక్కుంచుకుంది. వెనుజులాలో నిక్షిప్తమైన ముడి చమురు ఉత్పత్తులను వెలికితీసే 95 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు కరబాబో -1 బిడ్ ను ఓఎన్ జీసీ విదేశ్ గెలుచుకుంది. గడిచిన 11 ఏళ్ల తరువాత వెనుజులా భారీ విస్తీర్ణంలో నెలకొన్న ముడి చమురు ఉత్పత్తులు వెలికి తీసేందుకు నిర్వహించిన వేలంలో ఓఎన్ జీసీ ఈ ప్రాజెక్టును కైవశం చేసుకుంది. ఓఎన్ జీసీ విదేశ్ తొలిసారిగా 2008లో లండన్ లోని ఇంపీరియల్ ఎనర్జీ కి సంస్థకు చెందిన రెండు వందల కోట్ల డాలర్ల ప్రాజెక్టును వశం చేసుకోగా, రెండో ప్రాజెక్టుగా కరబాబోను సాధించగలిగింది.
కరబాబో -1 ప్రాజెక్టులో భాగంగా 31 బిలియన్ల బ్యారల్స్ ముడి చమురును వెలికితీయనున్నారు. ఈ ప్రాజెక్టులో ఓన్ జీసీ 11 శాతం భాగస్వామ్యం కలిగి ఉండగా, స్పెయిన్ కు చెందిన రెప్సాల్, మలేషియాకు చెందిన పెట్రోనాస్ లు కూడా వాటాను కలిగిఉన్నాయి. అయితే వెనుజులాకు చెందిన ఆయిల్ కంపెనీ పిడినిఎస్ఎ సంస్థతో కలపి స్పెయిన్, మలేషియా సంస్థలతో పాటుగా భారతీయ కంపెనీలు ఓఎన్జీసీ, ఆయిల్ యండియా లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లు కలసి ఉమ్మడి సంస్థగా ఆవిర్భవించనున్నాయి. వెనుజులా సంస్థ పిడిఎస్ఎ, వెనుజులానా డెల్ పెట్రోలియో సంస్థలు ఈ ప్రాజెక్టులో 60 శాతం వాటాను కలిగి ఉంటాయి.ఈ ప్రాజెక్టులో ఇండియాకు చెందిన ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 3.5 శాతంతో భాగస్వామ్యాన్ని కలిగిఉన్నాయి. దీంతో ఈ ప్రాజెక్టు మొత్తంలో ఇండియా 18 శాతం వాటాను కలిగిఉంది. ఈ ప్రాజెక్టు కోసం 19 బిలియన్ అమెరికన్ డాలర్లను వెనుజులా వ్యయం చేయనుంది. ప్రాథమిక పెట్టుబడిగా 9 బిలియన్ డాలర్లను కేటాయించింది. మరో ఐదు వేల కోట్ల రూపాయలను ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నప్పుడు ఓఎన్ జీసీకి అందచేయనుంది.
అయితే పెట్టుబడుదారులుగా ఇండియాకు ఈ ప్రాజెక్టు ద్వారా భారీగా వనరులు సమకూరనున్నాయి. ముడి చమురు ఉత్పత్తుల్లో 5-6 శాతం భారత్ కు దక్కనున్నాయి. అంతేగాక 9 మిలియన్ టన్నుల ఉత్పత్తులను మొదట కొనుగోలు చేసే హక్కు ఇండియా కే ఉంటుంది. 2012-13 సంవత్సరాల మధ్య చమురు ఉత్పత్తుల వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 4 లక్షల బ్యారల్స్ వరకు ముడి సరుకు ఉత్పత్తి అవుతుందని, సంవత్సనాకి 20 మిలియన్ టన్నుల వరకు ఉత్పత్తి ఉంటుందని అంచనా.
అయితే కరబాబో-1 ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే ముడి చమురును అన్ని రీఫైనరీల్లో శుద్ది చేయడం సాధ్యం కాదు. దీంతో ముడి చమురును శుద్ధి చేసేందుకు ఆవసరమైన రసాయినాలను వెనుజూలాకు చెందిన పిడివిఎస్ఎ కంపెనీ సరఫరా చేయనుంది.2016-17 సంవత్సరం నాటికి ఆ సంస్థ ముప్పై వేల కోట్ల రూపాయలతో అవసరమైన శుద్ధి కర్మాగారాలను నిర్మించాలని యోచిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఆ ముడి చమురును ఓఎన్జీసీ భారతీయ ప్రైవేటు ఆయిల్ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్సార్ కంపెనీలకు చెందిన శుద్ది కర్మాగారాల్లో ముడి ఉత్పత్తులను శుద్ధి చేయనున్నారు.
News Posted: 12 February, 2010
|