మారుతి 800 కి మంగళం
న్యూఢిల్లీ : మధ్యతరగతి ప్రజలకు కారు అన్న సంజయ్ గాంధీ ఆశయానికి అనుగుణంగా వచ్చిన మారుతీ 800 కారుకు మారుతీ సుజుకి మంగళం పాడుతోంది. దేశంలోని 13 నగరాల్లో వచ్చే ఏప్రిల్ నుంచి ఈ బుల్లి కారు అమ్మకాలను నిలిపేయాలని నిర్ణయించింది. తక్కువ ఖరీదు కారుగా సామాన్యులకు మూడు దశాబ్ధాల పాటు భారతీయులను అలరించిన ఈ చిన్నికారును ఆధునీకరించే ఆలోచన ఏమీ లేదని మారుతీ సుజుకి చైర్మన్ ఆర్ సి భార్గవ శుక్రవారం నాడు ప్రకటించారు. ఒకప్పుడు మారుతీ సంస్థకు కాసులు పంట పండించిన మారుతీ 800 ఉత్పత్తిని నిలిపివేయడానికే నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. అంతే కాకుండా చిన్నకార్ల విభాగం మారుతీ 800, ఆల్టో, వేగన్ ఆర్, ఎస్టిలో, ఏ స్టార్, రిట్జ్, స్విఫ్ట్ మోడళ్ళతో నిండిపోయిందని, వీటి సంఖ్యను తగ్గించే యోచనలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అంటే సమీప భవిష్యత్ లో మరిన్ని చిన్ని కార్లను మార్కెట్ నుంచి ఉపసంహరించే యోచనలో మారుతీ ఉంది.
ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూనే, కాన్పూర్, అహ్మదాబాద్, సూరత్, ఆగ్ర నగరాల్లో 2010 ఏప్రిల్ నుంచి బిఎస్ IV ప్రమాణాలు అమలు లోకి రానున్నాయి. మిగతా నగరాలు , పట్టణాలు బిఎస్III ప్రమాణాల కిందకు వస్తాయి. కాబట్టి ఈ పట్టణాల్లో మరి కొంతకాలం మారుతీ 800 కనిపించవచ్చు. ఈ నగరాలు కూడా 2015-16 నాటికి బిఎస్ IV కిందకు వచ్చేస్తాయి. అప్పటికి మారుతీని పూర్తిగా మార్కెట్ నుంచి ఉపసంహరిస్తారు.
చిన్నకార్ల విభాగంలో పోటీ పెచ్చు మీరిపోయింది. టయోట, ఫోక్స్ వేగన్, ఫోర్డు, నిస్సాన్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు చిన్నకార్లను ఆకర్షణీయంగా అన్ని ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసి వదులు తున్నాయి. దానికి తోడు భారతీయ కంపెనీ టాటా ఎంట్రీ లెవెల్ కారుగా అతి తక్కువ ధరకు నానోను తయారు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పటికే మారుతీ జెన్ మోడల్ ను ఆపేసింది. అనేక పేర్లతో ఎక్కువ మోడళ్ళను తయారు చేయడం కంటే ప్రజల ఆదరణను చూరగొన్న ఆల్టోను మరింత ఆధునీకరిస్తే మంచిదనే ఆలోచనలో మారుతీ సుజుకీ ఉంది.
News Posted: 12 February, 2010
|