బిడబ్ల్యుఎ స్పెక్ట్రమ్ వేలం
న్యూఢిల్లీ : 3జి లేదా మూడవ తరం మొబైల్ సర్వీసుల కోసం స్పెక్ట్రమ్ వేలం సమస్య ఇంకా పరిష్కారం కాని దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరంలోనే బ్రాడ్ బ్యాండ్ వైర్లెస్ ఏక్సెస్ (బిడబ్ల్యుఎ) కోసం స్పెక్ట్రమ్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా టెలికమ్యూనికేషన్ల శాఖ (డిఒటి)ని ప్రధాని కార్యాలయం (పిఎంఒ) కోరింది.
3జి, బిడబ్ల్యుఎ స్పెక్ట్రమ్ వేలం కార్యక్రమాలను ఈ నెలలో నిర్వహించవలసి ఉంది. ఇవి జరిగితే ప్రభుత్వానికి రూ. 30 వేల కోట్లు ఆదాయం లభించి ఉండేది. బిడబ్ల్యుఎ స్పెక్ట్రమ్ వేలం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొంత రెవెన్యూ రాబట్టడానికి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీకి సౌలభ్యం కలుగుతుంది. ఆర్థిక మాంద్యం వల్ల పన్ను వసూళ్ళు తగ్గడం, ఉద్దీపన పథకంతో పన్నులు వసూలు చేసే అవకాశం లేకపోవడం వల్ల రెవెన్యూ విషయంలో ఆర్థిక మంత్రి సమస్య ఎదుర్కొంటున్నారు.
వేలంపాట కోసం 2.3 జిహెచ్ జడ్ బ్యాండ్ లో బిడబ్ల్యుఎ స్పెక్ట్రమ్ కు సంబంధించి ఒక్కొక్కటి 10 మెగాహెర్ట్ జ్ ల స్థాయి గల రెండు స్లాట్లను డిఒటి కేటాయించింది. ఈ లైసెన్సు కు బేస్ ధర రూ. 1750 కోట్లు. 3జి లైసెన్స్ ధరలో ఇది సగం. అందువల్ల ఈ వేలంతో ప్రభుత్వానికి కనీసం రూ. 3500 కోట్ల మేరకు ఆదాయం లభించగలదు.
'3జి నుంచి బిడబ్ల్యుఎని వేరు చేసే అవకాశాన్ని పరిశీలించవలసిందిగా పిఎంఒ నుంచి మాకు ఒక లేఖ అందింది. మేము ఈ అవకాశాన్ని పరిశీలిస్తున్నాం' అని టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
News Posted: 12 February, 2010
|