ఆపరేటర్లూ తస్మాత్: ట్రాయ్
న్యూఢిల్లీ : ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న టెలీకాం ఆపరేటర్లకు ట్రాయ్ అక్షింతలు వేసింది. వినియోగదారుల ఫిర్యాదుల పట్ల నిర్యక్షం వహించినా, వారి సమస్యలను సకాలంలో పరిష్కరించకపోయినా సహించేది లేదని ట్రాయ్ హెచ్చరించింది. ఈ క్రమంలో ట్రాయ్ ఐదు టెలీకాం సంస్థలకు సుతిమెత్తగా హెచ్చరిక లేఖలు రాసింది.
సెల్ ఫోన్ నెట్ వర్క్ సేవల్లో ఇటీవల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, నెట్ వర్క్ రద్దీగా ఉందని, సంభాషణల్లో స్ఫష్టత లేకుండా వింతవింత శబ్దాలు వినిపించడం, అర్ధాంతరంగా కాల్ కట్ అవడం వంటి సమస్యలను ఏకరువు పెడుతూ వినియోగదారులు టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కి ఫిర్యాదులు చేసారు. దీంతో ట్రాయ్ చైర్మన్ జే ఎస్ శర్మ ఆయా టెలీకాం సంస్థలకు లేఖలు పంపించారు. సునీల్ మిట్టల్ (భారతీ ఎయిర్ టెల్), అనిల్ అంబానీ (ఆర్ కాం), సంజీవ్ అగా (ఐడియా), అనిల్ సరడానా (టిటిఎస్ఎల్), మార్టెన్ పీటర్స్ (వొడాఫోన్), కుల్దీప్ సింగ్ (ఎంటిఎన్ఎల్)లకు ట్రాయ్ చైర్మన్ లేఖలు రాశారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాలని ఆ లేఖల్లో ఆయన సూచించారు. కాల్ సెంటర్లు కస్టమర్లకు సమాచారం అందించడం, వాయిస్ నాణ్యతను మెరుగుపరచడం, నెట్ వర్క్ రద్దీని నియంత్రించడం వంటి చర్యలు చేపట్టాలని శర్మ టెలీకాం సీఈఓలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. వినియోగదారుల ఫిర్యాదులపై తక్షణం స్పందించేలా ఆయా సంస్థల నోడల్ ఆఫీసర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూడాలని లేఖలో సూచించారు.
మొబైల్ వినియోగదారుల నుండి ట్రాయ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని, మొబైల్ సేవలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు లేఖలు వస్తున్నాయని శర్మ చెప్పారు. సెల్ ఫోన్ వినియోగదారుల సమస్యను పరిష్కరించేందుకు గాను తాను టెలికాం సంస్థల అధినేతలకు లేఖలు రాశానని ఆయన వివరించారు. అయితే కొత్తగా వచ్చిన కంపెనీలకు తాను లేఖలు రాయలేదని, వారింకా పూర్తిస్థాయిలో సేవలందించడానికి సన్నద్ధమయ్యే పనిలో ఉన్నందున వారికి మినహాయింపునిచ్చినట్లు పేర్కొన్నారు.
News Posted: 13 February, 2010
|