| మొబైల్ పైనే మోజున్యూయార్క్ : 'మింగు మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె ' అంటే అచ్చంగా ఇదే మరి. తినడానికి తిండి లేకపోయినా సెల్ ఫోన్ మాత్రం చేతిలో రింగ్ రింగ్  మనాల్సిందే. ఆ పూట తినినా, తినకపోయినా, నెల జీతం వచ్చినా, రాకపోయినా హలో...హలో  అంటూ మాటలు కలపాల్సిందే.  ప్రతీ ఒక్కరికి మొబైల్  నిత్యావసర వస్తువుగా మారడంతో ఏమున్నా..లేకున్నా మొబైల్ తప్పనిసరి అయింది. ప్రపంచాన్ని విలవిలలాడిస్తోన్న ఆర్థిక మాంద్య సంక్షోభంలోనూ మొబైల్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడం ఇందుకు తాజా ఉదాహరణ. ఆర్థిక సంక్షోభం కారణంగా అన్ని వ్యాపార రంగాలు కుదేలై ఏకంగా బోర్డులు తిప్పుకుని పోతుండగా మొబైల్ రంగం మాత్రం ఏ మాత్రం చెక్కుచెదరలేదు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల సంఖ్య ఐదువందల కోట్లుకు చేరబోతుండంటంతో ఈ రంగం విశేష పురోగతిని సాధిస్తోంది. మొబైల్ ద్వారా లభించే సేవలు రోజురోజుకు విస్తరిస్తుండటంతో శరవేగంతో ఈ రంగం అభివృద్ధి సాధిస్తోందని ఐక్యారాజ్యసమితికి చెందిన టెలికాం ఏజెన్సీ వెల్లడించింది.
 
 ఈ ఏడాది చివరకు ప్రపంచవ్యాప్తంగా ఐదువందల  కోట్లకు  మొబైల్ వినియోగదారుల సంఖ్య చేరనుందని ఆ సంస్థ తెలిపింది. బార్సీలోనా లో జరుగుతున్న పారిశ్రామిక మహాసభల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. మొబైల్ ద్వారా అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బ్యాంకింగ్, హెల్త్ వంటి వంటి  సేవలు విస్తృతమవుతుండటంతో మొబైల్ ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఆ సంస్ధ వివరించింది. ఆర్ధిక మాంద్యంలో మొబైల్ తో పాటుగా మొబైల్ ఇంటర్నెట్  వినియోగదారుల సంఖ్య పెరగడం విశేషమని ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్ యూనియన్ (ఐటియు) పేర్కొంది.  గత ఏడాది నాటికే  సెల్ వినియోగదారుల సంఖ్య 4 వందల కోట్లు దాటిందని, ఈ ఏడాది చివరకు ఆ సంఖ్య ఐదువందల కోట్లు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ఐటియు ప్రధాన కార్యదర్శి హమాడొన్ టౌర్ చెప్పారు. వినియోగదారుల సంఖ్య ఇదే రీతిలో పెరిగితే రానున్న ఐదేళ్లలో మొబైల్ ద్వారా ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య విస్తృతంగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అంతేగాక డెస్క్ టాప్ కంప్యూటర్, ల్యాప్ టాప్ ల ద్వారా ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి కంటే మొబైల్ ద్వారా ఇంటర్నెట్ ను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు.
 
 అత్యంత చవకైన మొబైల్ ద్వారా కూడా టెలి మెడిసిన్ సొలభ్యం పొందే రోజులు అత్యంత సమీపంలోనే ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. డాక్టర్ అపాయింట్ మెంట్, చెక్ అప్ డేట్, మందుల వినియోగం వంటి సమస్త సమాచారం ఎస్ఎంఎస్ ల ద్వరా అందుబాటులోకి రానుందని వివరించారు. ఆధునిక సాంకేతిర పరిజ్ఞానంతో రూపొందించే టెలిమెడిసిన్ ద్వరా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది  ప్రాణాలు కాపాడే సాధనంగా మొబైల్ రూపాంతరం చెందుతుందని తౌర్  పేర్కొన్నారు. కొసమెరుపు ఏమిటంటే  మొబైల్ వినియోగదారుల్లో చాలా మందికి  బ్యాంక్ అకౌంట్లు కూడా లేవట!
 
 
 
 
 News Posted: 16 February, 2010
 
 
 
 
 
 |