బడ్జెట్ తర్వాతే పెట్రో వడ్డన
న్యూఢిల్లీ : రవాణా ఇంధనాల, వంట గ్యాస్ ధరలను బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తరువాత పెంచాలని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ సలహా ఇస్తోంది. ఐక్య ప్రగతిశీల కూటమి(యుపిఎ) ప్రభుత్వంపై కాంగ్రెస్సేతర పక్షాలు, ఇతర విపక్షాలు కలిసికట్టుగా దాడి చేసే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తోంది. ఫిబ్రవరి 22 వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతాయి. సమావేశాల మొదటి వారంలో ఆర్థిక సర్వే ను, రైల్వే, సాధారణ బడ్జెట్ లను ప్రవేశపెడతారు. ఇప్పటికే పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచక తప్పదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే అమ్ముతున్న ఉత్పత్తులకు ప్రభుత్వం నష్టాన్ని సబ్సిడీల రూపంలో చెల్లిస్తోంది. ఇది మరింత భారంగా మారిందని, ధరలు పెంచక తప్పదని చెప్పినప్పటికీ నిర్ణయాన్ని ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కి వదిలి వేశారు.
యూపియే ప్రభుత్వం రెండో సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్ లో కూడా 'ఆమ్ ఆద్మీ' తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెట్రో ధరలను పెంచుతూ ప్రకటన చేసిన తరువాత వచ్చే రాజకీయ దుమారానికి ఈ తాయిలాలు రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయని, అందువల్ల పెట్రో ధరలను బడ్జెట్ సమావేశాల అనంతరమే పెంచడం శ్రేయస్కరమని ఆర్ధిక మంత్రిత్వ శాఖ యోచనగా ఉంది. అయితే ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీలు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, కిరోసిన్ లను మార్కెట్ రేటు కంటే తక్కువకు అమ్మడం వలన దాదాపు 45 వేల 570 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు అంచనా. కానీ ఆర్ధిక మంత్రిత్వ శాఖ సబ్సిడీ రూపంలో 12 వేల కోట్లను చెల్లించడానికి మాత్రమే అంగీకరించింది. ప్రతీ లీటరు పెట్రోలు పై 4.63 రూపాయలు, డీజిల్ పై 1.89 రూపాయలు, కిరోసిన్ పై 18.06 రూపాయలు, వంట గ్యాస్ సిలిండర్ పై 287.59 రూపాయలను ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయి. ఈ లెక్కలను పరిగణనలోనికి తీసుకుని పారీఖ్ కమిటీ రవాణా ఇంధనాల ధరలను మార్కెట్ స్థాయికి పెంచాలని, కిరోసిన్ ధరపై ఆరు రూపాయలు, వంట గ్యాస్ పై వంద రూపాయలు పెంచాలని సిఫార్సు చేసింది.
News Posted: 18 February, 2010
|