హైదరాబాద్ : ఏ పనీ చేయకుండా ఎవరైనా రోజూ డబ్బు ఇస్తారా..? ఎవ్వరూ ఇవ్వరూ .. అన్నది మీ సమాధానం అయితే పొరపాటే. ఇంతటి ఆర్థిక మాంద్యంలో ఏ పనీ చేయకుండా రోజూ డబ్బు వచ్చి పడే అదృష్ట కాలం వచ్చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుండి మీకు అసలు ఏమాత్రం సంబంధం లేకుండానే మీ బ్యాంక్ అకౌంట్లోకి ఏ రోజుకారోజు డబ్బు వచ్చి చేరుతుంది. ఏంటి కలా.. నిజమా అని సంశయిస్తున్నారా..? మీరు చదివింది అక్షరాలానిజమే! సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ అందిస్తున్న గొప్ప వరం ఇది. బ్యాంకులకు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీచేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై సేవింగ్స్ ఖాతాదారులకు రోజూ ఆదాయం రానుంది. బ్యాంక్ ఖాతాలో నిల్వ ఉన్న మొత్తానికి ఇకపై ఏ రోజుకారోజు వడ్డీ లెక్కగట్టి జమ చేయాలని వాణిజ్య బ్యాంక్ లకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ అమలులో ఉన్న నెలవారీ వడ్డీ లెక్కింపునకు స్వస్తి పలకాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
2009-10 వార్షిక ప్రణాళికలో భాగంగా సరికొత్తగా బ్యాంక్ ఖాతాల విధానాన్ని ఆర్బీఐ రూపొందించింది. ఈ నూతన విధానాల ప్రకారం వాణిజ్య బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాల్లో నిల్వ ఉన్న డబ్బుకు రోజువారీ వడ్డీ జమచేయాలని సూచించింది. ఇప్పటివరకు బ్యాంకులన్నీ నెలకోసారి మాత్రమే సేవింగ్స్ ఖాతాపై వడ్డీని జమచేస్తున్నాయి. నెలలో ఒకటో తేదీ నుండి చివర తేదీ వరకు లెక్కగడుతున్నాయి. ఒకవేళ ఖాతాదారు నెలంతా నిల్వ ఉంచి నెల చివరి రోజున సొమ్ము తీసుకుంటే ఆ నెల మొత్తానికీ బ్యాంకులు వడ్డీని ఎగవేస్తున్నాయి. బ్యాంకులు అనుసరిస్తున్న ఈ విధానం వల్ల ఖాతాదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుండటాన్ని ఆర్బీఐ గమనించింది. దీంతో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. నెలవారీ వడ్డీ బదులు ఇకపై రోజువారీ వడ్డీ జమచేయాలని నిర్ణయించింది.
ఈ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై ఆర్బీఐ ఇండియన్ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఎ) అభిప్రాయం కోరింది. ఈ విధానాన్ని అనుసరించాలంటే బ్యాంకుల కంప్యూటరీకరణ చేయాల్సిన అవసరం ఉందని ఐబీఎ ప్రతినిధులు ఆర్బీఐకి సమాధానం పంపారు. ఇపుడు వాణిజ్య బ్యాంకులన్నీ దాదాపుగా కంప్యూటరీకరణ జరిగిన నేపథ్యంలో సేవింగ్స్ ఖాతాల్లో రోజువారీ వడ్డీ జమను ఆర్బీఐ తెరపైకి తెచ్చింది. '2010 ఏప్రిల్ ఒకటో తేదీ నుండి అన్ని వాణిజ్య బ్యాంకులు సేవింగ్స్ ఖాతాల్లో నిల్వ ఉన్న మొత్తానికి రోజువారీ వడ్డీని లెక్కగట్టి ఖాతాల్లో జమ చేయాలి' అంటూ ఆర్బీఐ బ్యాంకులకు సమాచారం పంపింది. అయితే బ్యాంకులు మాత్రం ఆర్బీఐ ఆదేశాలపై అభ్యంతరాలు చెబుతున్నాయి. 'ఈ నూతన విధానాన్ని కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని ఆర్బీఐని కోరుతున్నాం. ఈ విధానాన్ని ఇప్పుడు అమలు చేస్తే బ్యాంకులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది' అని ఐబీఏ చైర్మన్ ఎం వి నాయర్ చెప్పారు.
ఆర్బీఐ మాత్రం తమ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిందేనని స్ఫష్టం చేస్తోంది. సేవింగ్స్ ఖాతాలపై 3.5 శాతం వడ్డీని ఏప్రిల్ ఒకటి నుండి జమచేయాలని ఉద్ఘాటించింది.