స్విస్ బ్యాంకుల షరతు
న్యూఢిల్లీ : పన్ను ఎగవేతదారులపై సమాచారం మార్పిడికి ద్వైపాక్షిక పన్ను ఒప్పందం గురించి ఇండియా, స్విట్జర్లాండ్ తిరిగి సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో తమ దగ్గర నుంచి రహస్య ఖాతా వివరాలు కోరే ఏ దేశమైనా సంబంధిత వ్యక్తి, బ్యాంకు పేర్లతో నిర్దుష్టంగా సమాచారం అందజేయాలని స్విస్ బ్యాంకులు స్పష్టం చేశాయి.
'సమాచారం కోసం విజ్ఞప్తి చేసే దేశం సంబంధిత వ్యక్తి పేరును, బ్యాంకు పేరును తెలియజేయాలి. ఏ తప్పూ చేయని అమాయక ఖాతాదారుల ప్రైవసీని కాపాడడమే ఈ చర్య లక్ష్యం. ఇది సరైనదని మా విశ్వాసం' అని స్విట్జర్లాండ్ లోని బ్యాంకుల ప్రాధికార సంస్థ స్విస్ బ్యాంకర్స్ అసోసియేషన్ (ఎస్ బిఎ) ఉన్నతాధికారి ఒకరు బాసెల్ లో ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
స్విస్ బ్యాంకుల లావాదేవీలలో గుంభనం గురించి ఎప్పుడూ రాజకీయ వివాదం రేగుతూనే ఉంది. ఆ బ్యాంకులలో రహస్య ఖాతాలలో వందల కోట్ల డాలర్లను అక్రమంగా దాచుకున్నట్లు అనేక మంది భారతీయులపై ఆరోపణలు వస్తుంటాయి.
'స్విస్ బ్యాంకుల విదేశీ ఖాతాదారుల విషయంలో పన్ను మోసం, పన్ను ఎగవేత మధ్య సాంప్రదాయకమైన చట్టబద్ధమైన వ్యత్యాసానికి స్విట్జర్లాండ్ స్వస్తి చెబుతుంది. పన్ను ఎగవేతతో సహా అన్ని పన్ను కేసులలో అంతర్జాతీయంగా పాలనాపరమైన సహాయాన్ని స్విట్జర్లాండ్ అందజేస్తుంది' అని ఎస్ బిఎ అధికార ప్రతినిధి జేమ్స్ నేసన్ తెలియజేశారు. ఒఇసిడి మోడల్ పన్ను నియమావళి (ఎంటిసి) కూడా ఏదైనా ఆసక్తిపూర్వక సమాచారాన్ని రాబట్టగలమనే ఆశతో బ్యాంకు ఖాతాలను అవాంఛిత, అసమంజస, వివక్షపూరిత పద్ధతిలో పరీక్షించడాన్ని అనుమతించదని ఆయన తెలిపారు. (ఒఇసిడి ఎంటిసి ఆధారంగానే ఇండియా, తదితర దేశాలతో కొత్త ఒప్పందాలను స్విట్జర్లాండ్ కుదుర్చుకుంటున్నది.) ఇండియాతో సహా 70 పైచిలుకు దేశాలతో ద్వైపాక్షిక ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం (డిటిఎఎ)లను సవరించడం ద్వారా పన్ను విషయాలపై సమాచారం మార్పిడికి సంబంధించి ఒఇసిడి ప్రమాణాలను స్విట్జర్లాండ్ అమలు జరుపుతున్నది. ఇండియా, స్విట్జర్లాండ్ మధ్య సమాచారం మార్పిడి నిబంధన ఏదీ లేకుండా ప్రస్తుతం డిటిఎఎ ఉందని స్విస్ పన్ను శాఖ ప్రతినిధి బీట్ ఫుర్రెర్ తెలిపారు.
News Posted: 22 February, 2010
|