ఆన్ లైన్ బాదుడు
ముంబయి : ముందుగా సౌకర్యాలు కల్పించడం, అలవాటుపడిన తరువాత సర్వీస్ చార్జిల పేరిట వినియోగదారుడిపై భారం మోపడం బ్యాంకులకు వెన్నతో పెట్టిన విద్య. ఈ తరహా బాదుడు జాబితాలో ఇపుడు తాజాగా ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా నిధుల మళ్లింపు ప్రక్రియ కూడా చేరింది. ఆన్ లైన్ లో నిధులు బదలాయింపులు చేస్తే వారి నుండి భారీగా చార్జిలను వసూలు చేసేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. ఈ ఆన్ లైన్ బాదుడును అమలు చేసేందుకు ఏప్రిల్ 1 తేదీని ముహూర్తంగా నిర్ణయించాయి.
ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బును ఒక అకౌంట్ నుండి మరో అకౌంట్ కు బదలాయింపును దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు అమలు చేస్తున్నాయి. ఇందుకు ఆర్బీఐ సహకారంతో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ (ఎన్ ఇ ఎఫ్ టి) విధానం ద్వరా ఎలక్ర్టానిక్ పద్ధతిలో డబ్బును బదలాయింపు చేస్తున్నాయి. 2005 నుండి అమల్లో ఉన్న ఈ విధానం ద్వారా ప్రతీ నెలా 60 లక్షల లావాదేవీలకు పైగా జరుగుతున్నాయి. దీనిని గమనించిన రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎన్ ఇ ఎఫ్ టి విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఈ విధానం ద్వారా ఆదాయం కూడా సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ ఎన్ ఇ ఎఫ్ టి విధానాన్ని పొందుతున్నందుకు గాను ఇప్పటివరకు బ్యాంకుల నుండి పైసా కూడా వసూలు చేయని ఆర్బీఐ ఇకపై తమకు డబ్బు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఆర్బీఐకి తాము డబ్బు చెల్లించాల్సి వస్తుండటంతో బ్యాంకులు ఆ భారాన్ని వినియోగదారులపై మోపి చేతులు దులుపుకోవాలని యోచిస్తున్నాయి.
ఒక అకౌంట్ నుండి మరో అకౌంట్ కు ఒకసారి డబ్బు బదలాయింపు చేసేందుకు బ్యాంకులు వినియోగదారుల నుండి ఐదు రూపాయలు చార్జిని ప్రస్తుతం వసూలు చేస్తున్నాయి. బ్యాంకులన్నీ మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్న అకౌంట్ కు మాత్రమే చార్జిని వసూలు చేస్తుండగా, డబ్బు చేరే అకౌంట్ కు మాత్రం ఎటువంటి చార్జీలు విధించడం లేదు. రెండో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా ఉన్న హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు కొద్ది కాలం ఈ సౌలభ్యాన్ని ఉచితంగా అందించినా కొద్ది రోజుల క్రితంగా చార్జీను వసూలు చేస్తోంది. ఎన్ ఇ ఎఫ్ టి సౌలభ్యాన్ని పొందుతున్నందుకు ఆర్బీఐకి బ్యాంకులు డబ్బు చెల్లించాల్సి వస్తుండటంతో ఈ మొత్తాన్ని భారీగా పెంచాలని బ్యాంకులు నిర్ణయించాయి. అంతేగాక ఆర్బీఐ తాజా సూచనలు అమలు చేసేందుకు ఇకపై మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్న అకౌంట్ నుండి డబ్బు చేరుతున్న అకౌంట్ కు చార్జిలు వసూలు చేయాలని బ్యాంకులు యోచిస్తున్నాయి. ఎన్ ఇ ఎఫ్ టి విధానాన్ని అమలు చేసేందుకు అయ్యే ఖర్చును వినియోగదారుడు నుండే వసూలు చేయాలని బ్యాంకులు విర్ణయించడమే ఇందుకు ప్రధాన కారణం. ఏప్రిల్ ఒకటి తేదీ నుండి మనీ ట్రాన్స్ ఫర్ కు కొత్త చార్జీలు వర్తించే అవకాశం ఉంది.
కాగా, మరో వైపు ఎన్ ఇ ఎఫ్ టి విధానం ద్వారా ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ విధానాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేయాలంటూ బ్యంకులకు ఆర్బీఐ లేఖలు రాసింది. మనీ ట్రాన్స్ ఫర్ వేగంగా జరిగేలా చూడాలని, వినియోగదారులకు మరింత చేరువ చేయాలని ఆ లేఖలో సూచించింది. అలాగే డబ్బు బదలాయింపునకు బ్యాంకులు అమలుచేస్తున్న నిర్ణీత సమయాలను మరింత పెంచాలని సూచించింది. ప్రస్తుతం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వ్వవధిలో మాత్రమే అమలు చేస్తున్న మనీ ట్రాన్స్ ఫర్ ను ఇకపై ఉదయం 9 నుండి రాత్రి 7 వరకు అమలు చేయాలని పేర్కొంది. అలాగే ప్రస్తుతం రోజుకు ఆరు విడతలుగా చేస్తున్న బదలాయింపును ఇకపై గంటల వ్యవధికి మార్చుకోవాలని కూడా ఆర్బీఐ సలహా ఇచ్చింది.
News Posted: 22 February, 2010
|