బాంబులకు బెదరని కారు
న్యూఢిల్లీ : డబ్బుతో ఆనందాన్ని కొనలేం. కాని కొన్ని కోట్లు ఖర్చుపెడితే ఈ బీభత్స యుగంలో మనం రోడ్లపై సురక్షితంగా సాగవచ్చు. మన దేశంలో అత్యంత ఖరీదైన కారును సోమవారం విడుదల చేశారు. 6 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఈ కారు హాయి అనిపించే కలల వాహనమే కాకుండా ప్రాణ రక్షణ కలిగించే 'కోట' వంటిదే. ప్రాణకవచం వంటి ఈ కారు అత్యంత తీవ్రమైన పేలుళ్ళకు కూడా చెక్కుచెదరదు. మెర్సిడిస్ బెంజ్ సంస్థ ఆవిష్కరించిన ఈ 'ఎస్-గార్డ్' కారు అత్యంత శక్తిమంతమైన రివాల్వర్ గుళ్ల నుంచి, రైఫిల్ తో ప్రయోగించే తూటాల నుంచి, మూడు హ్యాండ్ గ్రెనేడ్ల శకలాల నుంచి ఒకేసారి రక్షణ కల్పించగలదు. ఇటువంటిది సినిమాలలో చూసి ఉంటాం. ఇరాక్ లో కనిపించింది. కాని దైనందిన జీవితంలో ఉపయోగానికి ఇది ఇక ఎంతమాత్రం అనూహ్యమైనది కాదు.
అంతేకాదు. ఈ లిమోసిన్ లో జేమ్స్ బాండ్ తరహా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇది గాలిలేని టైర్లపై నడుస్తుంది, దీని ఇంధన ట్యాంక్ పేలుళ్ళను నివారించడానికి తనంతట తానుగా మూసుకుపోగలదు. దీనిలో మంటలను ఆర్పే వ్యవస్థ కూడా అమర్చి ఉన్నది. ఈ వాహనానికి ఇన్ ఫ్రా రెడ్ హెడ్ ల్యాంప్ లు, రాత్రి సమయాల్లో స్ఫష్టంగా చూడటానికి అనువైన వ్యవస్థ కూడా అమర్చారు. ఎస్-600 ఆధారంగా నిర్మితమైన ఎస్-గార్డ్ ధర మెర్సిడిస్-బెంజ్ తయారీ అయిన మేబాచ్ కారు ధరను కూడా మించిపోయింది. మేబాచ్ ప్రారంభ ధర రూ. 5.5 కోట్లు. ఎస్-గార్డ్ కారును ఇటీవల న్యూఢిల్లీలో ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు. దీనిని సోమవారం దేశీయ మార్కెట్ లోకి ప్రవేశపెట్టారు.
'ప్రాథమికంగా కార్పొరేట్, పరిశ్రమ అధినేతలు, ప్రభుత్వ అధికారులు, ప్రముఖులను దృష్టిలో పెట్టుకుని ఈ కారుకు రూపకల్పన జరిగింది. ఇండియాలో సురక్షితమైన, కవచం వంటి వాహనాలకు పెరుగుతున్న మార్కెట్ ను మేము సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాం' అని మెర్సిడిస్-బెంజ్ ఇండియా పాలక మండలి సభ్యుడు సుహాస్ కద్లాస్కర్ తెలియజేశారు. పూర్తిగా 'ప్రయాణ భద్రతగల వాహనం'గా ఈ కారు గురించి సంస్థ ప్రచారం చేస్తున్నది. 'ఎస్-గార్డ్ కోసం ఆసక్తిగల కస్టమర్లు మా వద్ద వాకబు చేస్తున్నారు. వ్యక్తులు కోరే ప్రత్యేకతలు, దిగుమతి సుంకం బట్టి కారు ధర ఉంటుంది' అని కద్లాస్కర్ తెలిపారు.
జర్మనీలోని సంస్థ ఫ్యాక్టరీ నుంచి పూర్తిగా తయారైన వాహనంగా ఎస్ -గార్డు వస్తుంది. అమ్మకాల లక్ష్యం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు కద్లాస్కర్ సమాధానం ఇస్తూ, 'గణాంకాల కన్నా మా కస్టమర్లకు ప్రామాణిక భద్రతను సమకూర్చాలన్నదే మా అభిమతం' అని చెప్పారు.
రాజకీయ నేతలలో ప్రధాని అధికార కార్లలో మెర్క్ ఒకటి ఉన్నది. ఇక సోనియా గాంధి టాటా సఫారి ఉపయోగిస్తుంటారు. నరేంద్ర మోడి బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోను వాడుతుండగా బుద్ధదేవ్ భట్టాచార్జీ బుల్లెట్ ప్రూఫ్ అంబాసడర్ ను ఉపయోగిస్తున్నారు.
News Posted: 23 February, 2010
|