9 బ్యాంకులకు అధిపతులు
న్యూఢిల్లీ : కనీసం తొమ్మిది ప్రభుత్వ రంగ (పిఎస్ యు) బ్యాంకులకు అధిపతులను, డజను మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ను నియమించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వారి పేర్లను ఖరారు చేసింది. వారిలో కొందరు ఇప్పుడున్న వారి స్థానాల్లో నియుక్తులు కావడమో లేక ప్రస్తుత ఖాళీలను భర్తీ చేయడమో జరుగుతుంది. భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (ఎస్ఐడిబిఐ) అధిపతి ఆర్.ఎం. మళ్ళ ను ఐడిబిఐ బ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా యోగేష్ అగర్వాల్ స్థానంలో నియమించనున్నారు. యోగేష్ అగర్వాల్ పెన్షన్ రెగ్యులేటరీ ఏజన్సీ అధిపతిగా బాధ్యతలు స్వీకరించవచ్చు.
కెనరా బ్యాంక్ సిఎండి ఎ.సి. మహాజన్ స్థానంలో సిండికేట్ బ్యాంక్ సిఎఁడి బసంత్ సేఠ్ గాని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్. రామన్ గాని నియుక్తులు కావచ్చునని అభిజ్ఞ వర్గాలు సూచించాయి. బసంత్ సేఠ్ కెనరా బ్యాంక్ సిఎండిగా బాధ్యతలు చేపట్టినట్లయితే, ఆయన స్థానంలో రామన్ సిండికేట్ బ్యాంక్ కు సిఎండి అయ్యే అవకాశం ఉంది. సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇడి)గా ఉన్న ఆర్. రామచంద్రన్ ఆంధ్రా బ్యాంక్ సిఎండిగా బాధ్యతలు స్వీకరించవచ్చునని భావిస్తున్నారు. యూకో బ్యాంక్ సిఎండి పదవి జూన్ లో ఖాళీ అయినప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఆప్ ఇండియా (సిబిఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ కౌల్ ఆ పదవీ బాధ్యతలు స్వీకరించవచ్చు.
సెంట్రల్ బ్యాంక్ మరొక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామనాథ్ ప్రదీప్ కార్పొరేషన్ బ్యాంక్ సిఎండి కాగలరని అనుకుంటున్నారు. అనూప్ శంకర్ భట్టాచార్య బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సిఎండిగా బాధ్యతలు స్వీకరించవచ్చు. భట్టాచార్య ప్రస్తుతం చెన్నై కేంద్రంగా గల ఇండియన్ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఒబిసి) సిఎండి పదవి ఈ సంవత్సరాంతంలో ఖాళీ అయినప్పుడు నాగేష్ పైడా ఆ బాధ్యతలు స్వీకరించవచ్చు. పైడా ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్ బి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. హెచ్ఎస్ యు కామత్ కెనరా బ్యాంక్ నుంచి విజయా బ్యాంక్ కు బదలీ కావచ్చు.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఒబి)కి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైందని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, పంజాబ్ సింధ్ బ్యాంక్ (పిఎస్ బి) సిఎండిగా ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో రిటైర్ కానున్న జి.ఎస్. వేది స్థానంలో నియమించేందుకు అభ్యర్థిని ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదని ఆ వర్గాలు తెలిపాయి. కనీసం 12 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పేర్లను కూడా ఖరారు చేసినట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. ఇప్పటికే చైర్మన్ లుగా ఉన్న సేఠ్, మళ్ళ కాకుండా ఇతర బ్యాంకుల అధిపతులను క్రితం వారం ఒక రౌండ్ ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం నియమించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు త్వరలో ఆప్షన్ ఇవ్వనున్నట్లు ఈ నియామకపు ప్రక్రియ గురించిన సమాచారం క్షుణ్ణంగా తెలిసిన వర్గాలు తెలియజేశాయి.
News Posted: 24 February, 2010
|